BRS Councilor: తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌ను రాష్ట్ర ప్రజలు రెండు పర్యాయాలు ఆదరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. దీంతో తమకు తిరుగులేదన్న ధీమాతో గులాబీ నేతలు గ్రామాలు, పట్టణాల్లో అరాచకాలు సాగించారు. వారికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వత్తాసు పలకడంతో గులాబీ నేతులు ఏం చేసినా పోలీసులు చూస్తూ ఉండిపోయేవారు. వీలైతే ఎదుటివారిపైనే కేసులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. పథకాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, అక్రమంగా ఇసుక, మొరం అమ్ముకోవడం, వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడడం, ఇక అమ్మాయిలు, మహిళలను లొంగదీసుకోవడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. ఖమ్మంలో ఓ ఎమ్మల్యే తనయుడు నేరుగా దంపతులను వేధించి వారి ఆత్మహత్యకు కారణమయ్యాడు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి కార్యకర్తల అరాచకం కూడా ఓ కారణం. ఇక ప్రభుత్వం మారినా కొందరు చోటామోటా లీడర్లు తమ తీరు మార్చుకోవడం లేదు. తాము అధికారంలో ఉన్నామన్న భావనతోనే అరాచకాలు సాగిస్తున్నారు.
యువతితో దొరికిన కౌన్సిలర్..
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ బెంజర్ గంగారాం తన కూతురు వయసున్న ఒక అమ్మాయితో బోధన్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో అడ్డంగా దొరికాడు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కౌన్సిలర్ కు దేహ శుద్ధి చేశారు. లాడ్జి నుంచే కౌన్సిలర్ గంగారామ్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
మూడువారాల క్రితం ఇలాగే..
బోధన్ మున్సిపాలిటీకి చెందిన మరో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ ఒక అమ్మాయిని లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకుని మంగళ్ పహాడ్ శివారులో కారులోనే అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గమనించి కౌన్సిలర్ నుంచి అమ్మాయిని రక్షించారు. కౌన్సిలర్ కు దేహశుద్ధి చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నెలరోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఇద్దరు అమ్మాయిల కేసుల్లో అడ్డంగా బుక్ అవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇలా తయారయ్యారేంట్రా అని గులాబీ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.