Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు సమీపిస్తున్న తరుణంలో.. నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు భావించారు. పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు పదివేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక పోస్టుకు ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేయాలని చంద్రబాబు సూచించారు. కానీ ఒక పోస్ట్ కు ఐదుగురు నుంచి పదిమంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు మాదిరిగా.. నామినేటెడ్ పదవులకు సైతం ఐవిఆర్ఎస్ సర్వే చేపట్టారు చంద్రబాబు. ఈ సర్వేలను సైతం కొందరు నేతలు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది.గ్రామంలో క్రియాశీలక నాయకుల పేర్లు లేకుండా.. సామాన్యుల పేరిట ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఒకే సామాజిక వర్గంలో పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఒకే సామాజిక వర్గంలో విపరీతమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఒక రకమైన విభేదాలు ప్రారంభమయ్యాయి. దీనిపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. నామినేటెడ్ పోస్టుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరోసారి పగడ్బందీగా ఎంపిక ప్రక్రియ చేపట్టి జాబితాలను ప్రకటిస్తారని సమాచారం. ఈ పరిణామాలతో పార్టీలో నిరాశ అలుముకుంది.పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తికి గురవుతున్నాయి.
* కొత్త ఫార్ములాతో
రాష్ట్రంలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నేపథ్యంలో.. మూడు పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల పంపకం చేయాలని భావించారు. దీనికోసం ఒక ఫార్ములాను సైతం సిద్ధం చేశారు. టిడిపి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆ పార్టీకి 60 శాతం పదవులు కేటాయించాలని.. జనసేనకు 30 శాతం కేటాయించాలని.. బిజెపికి పది శాతం కేటాయించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ లెక్కన టిడిపికి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. అందుకే దీనిపై ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
* మారుతున్న తేదీలు
వాస్తవానికి ఆగస్టు 15న నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. టీటీడీ నుంచి కీలక కార్పొరేషన్ల వరకు ఎంపిక ప్రక్రియ ముగిసిందని కూడా టాక్ నడిచింది. చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే పార్టీ చేపట్టిన సర్వే తో పాటు ఎంపిక ప్రక్రియ పై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. తాత్కాలికంగా ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
* అక్టోబర్లో ప్రకటన
అక్టోబర్ లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐవిఆర్ఎస్ సర్వే మూలంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో ఈసారి.. ఎమ్మెల్యేల ద్వారా నాయకుల పేర్లు సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి ఒక పదవికి ఇద్దరి పేర్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పక్కాగా జాబితాను రూపొందించి అందరి ఆమోదంతో ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుందని ఆశించిన పార్టీ శ్రేణులకు.. నిరాశే ఎదురైంది.