Chandrababu: ఎన్నికల వేళ చంద్రబాబుకు షాకిచ్చిన బీజేపీ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మైనారిటీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ టిడిపి ఎన్ డి ఏ లో చేరడంతో మైనార్టీలు దూరమవుతూ వచ్చారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడవడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : April 26, 2024 4:35 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఈ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఓటమి ఎదురైతే.. దాని పరిణామాల గురించి చంద్రబాబుకు తెలుసు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలను సైతం వదులుకున్నారు. అయితేబిజెపితో పొత్తు పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. ఇతర భాగస్వామ్య పార్టీలకు బిజెపి అందిస్తున్న సహకారం.. టిడిపి విషయానికి వచ్చేసరికి దక్కడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నెల రోజుల కిందట ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వచ్చారు. తరువాత బిజెపి అగ్ర నేతల జాడలేదు. ఎట్టకేలకు ఒకరిద్దరు నాయకులు వచ్చారంటే.. విరుద్ధ ప్రకటన చేసి తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతీశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మైనారిటీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ టిడిపి ఎన్ డి ఏ లో చేరడంతో మైనార్టీలు దూరమవుతూ వచ్చారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడవడం ప్రారంభించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపితో సన్నిహితంగా మెలగడాన్ని మైనారిటీలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ వర్గంలో చీలిక వచ్చింది. చాలామంది మైనారిటీలు తిరిగి టిడిపి వైపు చూడడం ప్రారంభించారు. అయితే జగన్ ను ఢీకొట్టాలంటే పవన్ అవసరమని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని కలుపుకొని వెళ్తే సునాయాసంగా అనుకున్నది సాధించవచ్చని చంద్రబాబు భావించారు. అయితే ఇక్కడే వైసిపి నయా గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి అని.. బిజెపితో చేతులు కలిపారని ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి జాతీయ నాయకులు పిడుగు లాంటి వార్తను ప్రకటించారు.

ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. దాదాపు గంటకు పైగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటించారు. అయితే ఈ కీలక ప్రకటన చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కేవలం తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబుకు కొత్త టెన్షన్ ప్రారంభం అయ్యింది. టిడిపి ఎన్డీఏలోకి చేరడంతో ముస్లింలు ఏకపక్షంగా వైసీపీ వైపు చేరారన్న సంకేతాలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్రమంత్రి చంద్రబాబుతో సమావేశం కావడం, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో నష్టం తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమిపై స్పష్టమైన ప్రభావం చూపుతుందని.. ముస్లిం మైనారిటీ ప్రభావిత నియోజకవర్గాల్లో తప్పకుండా నష్టం జరుగుతుందని ఆ మూడు పార్టీల శ్రేణులు ఒక అంచనాకు వచ్చాయి.