BJP: ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. అది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఆ పార్టీ ఏపీలో విశేషంగా ప్రభావం చూపుతోంది. కేంద్రంలో అధికారం ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలతో డబుల్ గేమ్ ఆడుతోంది. రాజకీయ పార్టీల అవసరాలతో రాజకీయం చేస్తోంది.దీంతో ఏపీలో బలం లేకపోయినా.. ఇక్కడ పరిస్థితులను తన ఆధీనంలో పెట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఏ రాజకీయ పక్షం బిజెపిని వ్యతిరేకించడం లేదు. తెలుగుదేశం, వైసిపి, జనసేన బిజెపి స్నేహాన్ని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మూడు ప్రాంతీయ పార్టీలు మాత్రం బిజెపి కోసం పరితపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అందుకే బిజెపితో వెళ్లడం ద్వారా కోల్పోయిన రాజకీయ ప్రాభవాన్ని దక్కించుకోవాలని టిడిపి భావిస్తోంది. అటు వైసీపీ సైతం టిడిపి కంటే నమ్మకమైన స్నేహితుడిగా ఉంటానని బిజెపికి అభయం ఇస్తోంది. ఇప్పటికీ తాను ఎన్డీఏ భాగస్వామినని జనసేన చెబుతోంది. బిజెపితో పొత్తులపై టీడీపీ ఇప్పటివరకు బహిరంగంగా ఒక్క మాట చెప్పలేదు. ఎన్డీఏలో చేరే అంశం పైన స్పందించలేదు. గతంలో ఓసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లి వారితో భేటీ అయ్యారు. కానీ ఏం చర్చించారన్నదానిపై ఇరు వర్గాలు ఎవరూ స్పందించలేదు. ఎవరికి వారుగా తమ పని చేసుకుంటున్నారు.
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకు తగ్గ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనినే బిజెపి అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. అసలు బలమే లేని ఏపీలో రాజకీయం చేస్తోంది. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఎన్డీఏ లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. చంద్రబాబుతో ఇలా భేటీ ముగిసిందో లేదో.. జగన్ ఢిల్లీలో వాలిపోయారు. అయితే అటు చంద్రబాబును పిలిచి, ఇటు జగన్ తో చర్చించి.. ఏపీ విషయంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితిని నెట్టే ప్రయత్నం బిజెపి ఆగ్రనేతలు చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. మొత్తం ఏపీ రాజకీయాన్ని తిప్పుకునేలా బిజెపి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన బిజెపి… 40 శాతానికి మించి ఓట్లు ఉన్న వైసిపి, టిడిపిలను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుండడం విశేషం. దీనినే నిజమైన రాజకీయమంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.