SA20 2024 Final: సన్ రైజర్స్ గెలుస్తుందా? సూపర్ జెయింట్స్ సత్తా చాటుతుందా? ఫైనల్ పోరు నేడు..

ఐడెన్ మార్క్రామ్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు మాత్రమే ఓడిపోయింది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 10, 2024 4:52 pm
Follow us on

SA20 2024 Final: పొట్టి క్రికెట్ ఫార్మాట్ నిర్వహణలో మన దేశం మాత్రమే కాదు దక్షిణాఫ్రికా కూడా సత్తా చాటుతోంది.. సౌత్ ఆఫ్రికా 20 పేరుతో టి20 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. గత ఏడాది మొదటి ఎడిషన్ విజయవంతంగా సాగింది. ఈ ఏడాది రెండవ ఎడిషన్ లోకి అడుగుపెట్టిన ఈ టోర్నీ తుది అంచుకు చేరింది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఫైనల్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తో డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడునుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పై డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.. దీంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడుసార్లు తలపడ్డాయి. మొదటిసారి సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ రెండుసార్లు విజయం సాధించింది. రెండు జట్లకు సంబంధించిన అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేయడంతో కేప్ టౌన్ స్టేడియం నిండిపోయింది.

ఐడెన్ మార్క్రామ్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు మాత్రమే ఓడిపోయింది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. కేశవ్ మహారాజ్ ఆధ్వర్యంలో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.. క్వాలిఫైయర్_1 మ్యాచ్ లో ఈస్టర్న్ కేఫ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ..సూపర్ జెయింట్స్ తిరిగి పుంజుకుంది. క్వాలిఫైయర్_2 లో జో బర్గ్ సూపర్ కింగ్స్ పై 69 పరుగులు తేడాతో విజయం సాధించింది.

మైదానం ఎలా ఉందంటే.

న్యూ లాండ్స్ మైదానం మీద పచ్చిక, తేమ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంపై భారీ స్కోర్లు నమోదు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం న్యూ లాండ్స్ మైదానంపై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 172 పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నారు. ఇరుజట్లలో బలమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్న నేపథ్యంలో రసవత్తరమైన పోరు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంపై 38 మ్యాచులు జరిగాయి. బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు 151 పరుగులు, రెండవ అత్యధిక స్కోరు 138 పరుగులు. ఈ మైదానంపై ఇంగ్లాండ్ మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ మైదానంపై ఇదే అత్యధిక స్కోర్ గా ఉంది. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఈ మైదానంపై 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ మహిళల జట్టు ఈ మైదానంపై 95 అతి స్వల్ప స్కోర్ నమోదు చేసింది.