Prudhvi Raj
Prudhvi Raj: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జాతీయ స్థాయిలో సైతం అందరి దృష్టి ఏపీపై పడింది. అటు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏజెన్సీలు వరుస పెట్టి సర్వేలు చేస్తున్నాయి. ప్రతిరోజు సర్వే ఫలితాలు ఇవి అంటూ వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో సర్వేలు సర్వసాధారణమైపోయాయి. ఇటువంటి తరుణంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీస్ పృధ్విరాజ్ తాను చేపట్టిన ఆసక్తికరమైన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయేనని తేల్చేశారు.
గత ఎన్నికల్లో పృథ్వీరాజ్ వైసీపీకి బలంగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృధ్విరాజ్ సేవలను గుర్తించిన జగన్ కీలక పదవి అప్పగించారు. టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు. ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించారు. అప్పటినుంచి వైసీపీకి దూరమైన ఆయన తెలుగుదేశం, జనసేనకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇటీవల జనసేనలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. జనసేన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం నుండి శ్రీకాళహస్తి వరకు తాను చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి అద్భుత విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ తేల్చి చెప్పారు. కూటమికి రాష్ట్రవ్యాప్తంగా 136 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రకటించారు. వైసిపి 39 స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అటు పార్లమెంట్ స్థానాల లెక్కను సైతం ప్రకటించారు. 25 పార్లమెంట్ స్థానాలకు గాను టిడిపి,జనసేన కూటమి 21 స్థానాలనుగెలుచుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ నాలుగు స్థానాలకి పరిమితం అవుతుందని తేల్చేశారు. వైసిపి నుంచి పడబోయే తొలి వికెట్ మంత్రి రోజాదేనని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే రోజా అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమ పవన్ వెంట నడుస్తుందని పృథ్విరాజ్ తేల్చి చెప్పారు. పవన్ చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి, జనసేన ప్రభుత్వం రాగానే సంబరాల రాంబాబు సేవలను వాడుకుంటామని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. అవినీతి అధికారులపై లోకేష్ రెడ్ డైరీ తరహాలో.. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై తాను బ్రౌన్ డైరీ రాస్తున్నట్లు పృథ్వీరాజ్ ఈ సందర్భంగా చెప్పారు. టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజాహిత పథకాలు, పాలన, అభివృద్ధి ప్రారంభమవుతుందని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ చెబుతుండడం విశేషం.