BJP – YCP : ఏపీలో రాజకీయంగా పట్టు బిగించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. పొత్తుల ద్వారా అయినా.. ఒంటరిగా అయినా ముందుకెళ్లి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వైసీపీతో ఉన్న బంధం దీనికి ప్రతిబంధకంగా మారింది. ముందుగా వైసీపీతో ఉన్న సంబంధాలు తెంపుకోవాలని చూస్తోంది. అందుకే వైసీపీ సర్కారుపై విమర్శల డోసును పెంచుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు.
శ్రీకాళహస్తి సభలో నడ్డా జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్ లేనని ఆరోపించారు. ఏపీలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. శాంతిభద్రతల విషయంలో చేతులు ఏత్తేశారని, చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ పనిచేయటం లేదని తప్పుబట్టారు. వైసీపీ డబ్బు సంపాదనలో బిజీగా ఉందని, వైసీపీని తుదముట్టించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాయలసీమను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని నడ్డా స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రతీ వారం ఢిల్లీ వెళ్తూ సీఎం జగన్ ప్రధాని మోదీ కి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో తిరుపతి లడ్డూ ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. మోదీని కూడా జగన్ నమ్మి ఏపీ కి ఎన్నో నిధుల ను ఇస్తున్నారని… అయితే ఏపీ కి వచ్చిన తరువాతనే జగన్ తన ప్రతాపం చూపిస్తున్నారని… కేంద్రం ఇచ్చిన ఇళ్ళు, బియ్యం, నిధులు, పథకాల మీద తన స్టిక్కర్ , తన పార్టీ రంగూ వేయించుకుంటూ బీజేపీ చేసిన మేలుని పూర్తిగా మరచిపోయారని అన్నారు. కేవలం రాజకీయం కోసం వైసీపీ నేతలు దిగజారి పోతున్నారని ఆయన విమర్శించారు.
అయితే ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారుపై బీజేపీ విమర్శల దాడి పెంచడం చర్చనీయాంశమవుతోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న పెద్దగా వర్కవుట్ కాలేదు. కేంద్ర పెద్దలతో జగన్ సాన్నిహిత్యం, పరస్పర రాజకీయ సహకారం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్న ఏపీ సర్కారును నియంత్రించకపోవడం వంటి వాటితో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అయితే దానిని అధిగమించేందుకు ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏపీకి క్యూకట్టడమే కాకుండా జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇక ముందు ఇదే దూకుడును కొనసాగించనున్నారు.