Nagababu : జనసేనాని పవన్ వారాహి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజల అనంతరం యాత్ర ప్రారంభంకానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా యాత్ర బాధ్యులను నియమించారు. యాత్రతో పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. జగన్ సర్కారుపై విరుచుకుపడనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. దీంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. వైసీపీ నేతలు డైపర్లు కట్టుకోవాల్సిందేనంటూ జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే వారాహి యాత్ర ప్రారంభమవుతున్న తరుణంలో పవన్ సీఎం అంటూ కొత్త స్లోగన్ ప్రారంభం కావడం విశేషం.
వారాహి యాత్ర నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేసిన ప్రెస్ నోట్ హాట్ టాపిక్ గా మారింది. పవన్ సీఎం కావాల్సిందేనని నాగబాబు తేల్చిచెప్పారు. జన సైనికులు ఇదే భావనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయని…అవన్నీ గాడిన పడాలీ అంటే పవనే సీఎం కావాలని ఆయన అంటున్నారు. సంఖ్యాబలం ఆధారంగానే వచ్చే ఎన్నికల తరువాత కొత్త సీఎం వస్తారని… అది పవనే అవుతారని ఆయన చెప్పడం విశేషం.పవన్ సీఎం నినాదాన్ని జనసేన వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. పవర్ షేరింగ్ ఉంటుందని.. పవన్ కు సీఎం పదవి కోసం బీజేపీ సైతం సపోర్టు చేస్తుందని నాగబాబు ప్రకటనతో విశ్లేషణలు వెలువడ్డాయి.
అయితే జన సైనికుల్లో నాగబాబు ఒక రకమైన చర్చ మిగల్చగలిగారు. పవన్ సీఎం అన్న తన ప్రకటనను తరువాత నాగబాబు సరిచేసుకున్నారు. వైసీపీ విముక్త ఏపీయే తమ ముందున్న లక్ష్యమని… అందుకు తమ అధినేత పవన్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని.. అందుకే వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. జగన్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు అందరూ ఐక్యం కావాల్సిన అవసరముందని కూడా చెప్పారు.
పవర్ షేరింగ్ ద్వారా పవన్ సీఎం అవుతారని చెప్పిన నాగబాబు.. ఇప్పుడు వైసీపీని గద్దె దించేందుకు అంతా ఒకతాటిపైకి రావాలని కోరడం హాట్ టాపిక్ గా మారింది. వామపక్షాలను సైతం ఆహ్వానించడమే ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీ ఉన్న కూటమిలోకి వామపక్షాలు వచ్చే చాన్సే లేదని విశ్లేషణలు ఉన్నాయి. కానీ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా, జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో జనసేన ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సైద్ధాంతిక వైరుధ్యం కలిగిన బీజేపీ, వామపక్షాలు సైతం ఒకేతాటిపైకి రావాలన్న నాగబాబు పిలుపులో జగన్ కు అధికారం నుంచి దూరం చేయాలన్న కసి కనిపిస్తోంది.