AP BJP: వైసీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ‘ఆకర్ష్’

ఏపీలో బలపడడానికి ఇదే సరైన సమయమని బిజెపి భావిస్తోంది. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఆ పార్టీ. వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల్లో ఐదుగురు బిజెపిలోకి రానున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : June 9, 2024 10:38 am

AP BJP

Follow us on

AP BJP: వైసిపి ఎమ్మెల్యేలపై బీజేపీ దృష్టి పెట్టిందా? గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సగం మంది పార్టీని వీడనున్నారా? చాలామంది బిజెపి టచ్ లోకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీనిని అవమానంగా భావిస్తున్న జగన్ వైసీపీ శాసనసభాపక్ష నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపిక చేశారు. అయితే గెలిచిన 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రమే జగన్ కు అత్యంత విధేయులు. మిగతావారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. అందుకే అందులో సగం మంది బీజేపీ టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో బలపడడానికి ఇదే సరైన సమయమని బిజెపి భావిస్తోంది. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఆ పార్టీ. వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల్లో ఐదుగురు బిజెపిలోకి రానున్నట్లు సమాచారం. అయితే వైసీపీ శాసనసభ పక్ష నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఆయనపై సైతం అధికారపక్షం ఎదురు దాడి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 గా వ్యవహరించిన పెద్దిరెడ్డి ఇప్పుడు టార్గెట్ కావడం ఖాయం.

గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రాయలసీమ రాజకీయాలను శాసించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అయితే.. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు చేయని ప్రయత్నం లేదు. రాయలసీమ అల్లరి మూకలను సైతం తెచ్చారని ప్రచారం జరిగింది. అందుకే ఆ ఇద్దరు తండ్రీ కొడుకులను విడిచిపెట్టరని టాక్ నడుస్తోంది. ఈ లెక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం వెనక్కి తగ్గుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులు చివరి వరకు ఆ పార్టీలో కొనసాగుతారన్న నమ్మకం కూడా లేదని చెబుతున్నారు. మొత్తానికైతే మున్ముందు వైసీపీకి చాలా రకాల కష్టాలు ఉన్నాయన్న మాట.