CBIT: పాఠాలు చెప్పే ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులు… సీబీఐటీ లో ఉద్యోగుల నిరసన

సిబిఐటి కాలేజీలో IQ AC డైరెక్టర్లకు వ్యతిరేకంగా కొంతమంది ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. IQ AC డైరెక్టర్లుగా కొనసాగుతున్న సుశాంత్ బాబు, త్రివిక్రమ్ మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 9, 2024 3:35 pm

CBIT

Follow us on

CBIT: సీబీఐటీ.. తెలుగు రాష్ట్రాలలో వేలాదిమందికి ఈ విద్యా సంస్థతో అనుబంధం ఉంటుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి మొదలు పెడితే ఎందరో నిష్ణాతమైన వ్యక్తులు ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. శేఖర్ కమ్ముల తాను తీసిన హ్యాపీడేస్ సినిమాను ఈ కాలేజీ నేపథ్యం ఆధారంగానే రూపొందించాడు. ఆ సినిమా తర్వాత ఈ కాలేజీ మరింత ఫేమస్ అయ్యింది. చాలామంది ఈ కాలేజీలో చదవడాన్ని స్టేటస్ సింబల్ గా చెప్పుకునే దాకా వెళ్ళింది. క్యాంపస్ ప్లేస్మెంట్, ఇంకా భిన్నమైన ఆవిష్కరణలతో ఈ కాలేజీ ఎప్పటికీ ముందుంటుంది. ఈ కాలేజీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

సిబిఐటి కాలేజీలో IQ AC డైరెక్టర్లకు వ్యతిరేకంగా కొంతమంది ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. IQ AC డైరెక్టర్లుగా కొనసాగుతున్న సుశాంత్ బాబు, త్రివిక్రమ్ మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఉదంతాన్ని ఓ మహిళ ప్రొఫెసర్ కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దానిపై కళాశాల యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇలాంటివి సర్వసాధారణమని ఆ కళాశాల ప్రిన్సిపల్ కొట్టి పారేయడం విశేషం.

తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినప్పటికీ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో.. ఆ మహిళ ప్రొఫెసర్ కు ఒళ్ళు మండిపోయింది. తన సహచర ఉద్యోగులకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆ కాలేజీలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది ఏకమయ్యారు.. IQ AC డైరెక్టర్లకు, ప్రిన్సిపాల్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బాధిత మహిళా ప్రొఫెసర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. IQ AC డైరెక్టర్లు సుశాంత్, త్రివిక్రమ్ ను విధుల నుంచి తొలగించాలని, తక్షణమే అరెస్ట్ చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.. ప్రిన్సిపల్ వెళ్లకుండా అడ్డంగా పడుకొని ఆందోళన చేశారు.. ఈ సందర్భంగా సిబిఐటి బోధ నేతర ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ.. బాధిత మహిళ ప్రొఫెసర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.. అయితే సంజీవ్ నిరసన చేస్తున్న సమయంలో.. అతడి పై నుంచి ప్రిన్సిపాల్ ఆగ్రహంతో బయటికి వెళ్లిపోవడం విశేషం. ఈ ఘటనతో ఎంతో పేరున్న సిబిఐటి కళాశాలలో కలకలం చెలరేగింది. మరి దీనిపై కళాశాల యాజమాన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.