Thalliki Vandanam: కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పథకాలపై స్పష్టత వచ్చింది.ముఖ్యంగా అమ్మకు వందనం పేరిట పిల్లల చదువుకు 15000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం ఎప్పుడు అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి.ఈ తరుణంలో ఏపీ బడ్జెట్లో దీనిపై స్పష్టతనిచ్చింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకానికి సంబంధించి 6487 కోట్ల రూపాయలను కేటాయించింది.ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి వర్తింపజేయనుంది.దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటించనుంది.
* గత ప్రభుత్వం అమ్మఒడి
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో నవరత్నాలను ప్రకటించారు జగన్.పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు15వేల చొప్పున ఈ పథకం కింద అందించేవారు.అయితే తొలి ఏడాది 1000 రూపాయలు కోత విధించారు. ఆ మరుసటి సంవత్సరం నుంచి 2000 చొప్పున కోత వేశారు.కానీ తాము అధికారంలోకి వస్తే 15000 రూపాయలు అందిస్తామని..ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింప చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సంక్రాంతి నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
* లోకేష్ ప్రత్యేక ఫోకస్
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు.వైసిపి హయాంలో చాలా పథకాలకు సంబంధించి కోత విధించారు. ముఖ్యంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాల విషయంలో బిల్లులు పెండింగ్లో ఉంచారు. దీంతో వేలాదిమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేయడంతో ఫీజులు కడుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ఈ సమస్యపై దృష్టి పెట్టారు. విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరిట పిల్లల చదువుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.