Kadambari Jethwani: ముంబై నటి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలివీ!

వైసిపి ప్రభుత్వ హయాంలో ఓ నటిని వేధించారన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ముంబైలో నమోదైన కేసు నుంచి ఓ పారిశ్రామికవేత్త కుటుంబాన్ని రక్షించేందుకు ఏపీ పెద్దలు రంగంలోకి దిగారు.పోలీస్ ఉన్నతాధికారులను ప్రయోగించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు కీలకంగా మారింది.

Written By: Dharma, Updated On : August 31, 2024 9:33 am

Kadambari Jethwani

Follow us on

Kadambari jetwani : ముంబై నటి కాదంబరి జెత్వాని వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో కీలక అంశాలు ఉన్నాయి. ప్రత్యేక పోలీస్ అధికారి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం పైన విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసు పై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది. నిన్ననే ముంబై నుంచి జెత్వాని విజయవాడ చేరుకున్నారు. నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో పలు సంచలన అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారుల కీలక పాత్ర పోషించారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నాడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, డిసిపి విశాల్ గున్నీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపై విజయవాడలో కేసు నమోదుకు ముందు ముంబైలో తన ఇంటి ముందు రెక్కీ కూడా నిర్వహించారని చెప్పుకొచ్చారు. పక్కా ప్రణాళికతోనే తమ కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకొచ్చారని బాధితురాలు పోలీసుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తరువాత ముంబైకి విజయవాడ పోలీసులు వచ్చి తనపై ఒత్తిళ్లు మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసు మరింత మలుపులు తిరుగుతోంది.

* పోలీసులు ఎదుట బాధితురాలు కీలక అంశాలు
కేసు నమోదు, అరెస్టు వంటి విషయాల్లో కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని కాదంబరి జెత్వానిచెబుతున్నారు. సాధారణంగా పదేళ్ల లోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీస్ ఇవ్వాలని.. సుప్రీంకోర్టు మార్గదర్శల ప్రకారం విచారించాల్సి ఉందని.. కానీ అటువంటివి ఏవి పాటించలేదని బాధితురాలు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

* ముందుగానే పోలీస్ శాఖ దర్యాప్తు
ముంబై నటి వ్యవహారానికి సంబంధించి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు ఇప్పటికే పోలీసులు స్పందించారు. సీఎంవో కు నివేదించారు. అందులో సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సజ్జన్ జిందాల్ కేసు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ లో 2023 డిసెంబర్ 17న సజ్జన్ జిందాల్ పై కేసు నమోదయింది. అక్కడకు రెండు వారాల తర్వాత సజ్జన్ జిందాల్ తాడేపల్లి వచ్చి అప్పటి సీఎం జగన్ ను కలిశారు. 2024 ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు జెత్వానిపై ఫిర్యాదు చేశారు. మూడో తేదీన పోలీసులు ముంబై వెళ్లారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు. అయితే పోలీసులు పెట్టిన షరతులకు తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో జెత్వానికి బెయిల్ లభించింది. అదే సమయంలో మార్చి 15న ముంబై పోలీసులు అక్కడ సజ్జన్ జిందాల్ పై పెట్టిన కేసును క్లోజ్ చేశారు.

* అక్కడ కేసు క్లోజ్.. ఇక్కడ బెయిల్
ముంబైలో సజ్జన్ జిందాల్ పై జెత్వాని కేసు పెట్టారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశారని.. వివాహం చేసుకోవాలని కోరారు. అందుకు జిందాల్ కుటుంబం అంగీకరించకపోవడంతో ఆమె కేసు పెట్టారు. అటు తరువాత జిందాల్ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. మధ్యలో కుక్కల విద్యాసాగర్ ఎంటర్ అయ్యారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ముగ్గురు పోలీస్ అధికారులు ఇందులో ఎంటర్ అయ్యారు. అదే సమయంలో కేసు విత్ డ్రా చేసుకోవడంతో ముంబై పోలీసులు కేసు క్లోజ్ చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధం ఉండడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇందులో ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ పై ఆరా తీయడంతో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.