Kadambari Jetwani Case : కాదంబరి జెత్వాని కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ అధికారి సంచలన నిర్ణయం

వైసిపి తో పాటు అప్పటి అధికారులను ఒక కేసు వెంటాడుతోంది. వైసీపీ హయాంలో ముంబై నటిని వేధించారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ఇప్పుడు అందులో ఒక అధికారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Written By: Dharma, Updated On : September 21, 2024 11:24 am

Kadambari Jetwani Case

Follow us on

Kadambari Jetwani Case  ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో కీలక ట్విస్ట్. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆమెను వేధించి తప్పుడు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడిపై కాదంబరి జెత్వాని కేసు పెట్టారు. ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఆమెను కోరితే వినలేదు. దీంతో ఆమెను దారికి తెచ్చుకునేందుకు ఏపీలో వైసిపి ప్రభుత్వ పెద్దలను సదరు పారిశ్రామికవేత్త ఆశ్రయించారు. ప్రభుత్వ పెద్ద ఒకరి ఆదేశాలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. వైసీపీ నేతతో తప్పుడు కేసు ఇప్పించారు. ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి బెదిరించారు. వినకపోయేసరికి తప్పుడు కేసులో రిమాండ్ విధించారు. దీంతో బెదిరిపోయిన ముంబై నటి కేసు విత్ డ్రాకు ఒప్పుకుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ఫిర్యాదు చేయడంతో వారిపై డిజెపి ప్రాథమిక విచారణ చేశారు. వారి పాత్రను నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందించారు. దీంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

* బెయిల్ పిటిషన్
అయితే తాజాగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టాటా దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. సోమవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఇతర ఇద్దరు ఐపీఎస్ అధికారులు సైతం ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో టాటా పిటిషన్ పై సోమవారం విచారణ లోపు ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

* విద్యాసాగర్ అరెస్ట్
కాదంబరి జెత్వాని కేసులో ప్రధానంగా వినిపించిన పేరు కుక్కల విద్యాసాగర్. ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టింది కూడా ఈయనే. అందుకే పోలీసులు సైతం ఈ కేసులో ఏ వన్ గా చూపారు. అరెస్టు కూడా చేశారు. డెహ్రాడూన్ లో దాక్కొని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. అక్కడ ఉన్నారని తెలియగానే ప్రత్యేక బృందం వెళ్లి ఆయనను అరెస్టు చేసింది. అయితే విద్యాసాగర్ దొరికారని సమాచారం అందగానే కాంతి రాణా టాటా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం విశేషం. నిజానికి ఆయన సస్పెండ్ అయ్యారు కానీ.. ఆయనపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. కేసు నమోదు కాకుండానే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

* ఆ భయంతోనే
ఒక్క కుక్కల విద్యాసాగర్ పేరును మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చారు. మిగతా వారి పేర్లు పొందుపరచలేదు. అయితే ఇప్పుడు ఏ వన్ నిందితుడు అరెస్టు కావడంతో.. ఏ క్షణంలోనైనా తమ పైకి వస్తారని ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారు. అందుకే అరెస్టు జరగకుండా చూసుకోవాలని ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కాంతి రాణా టాటా పాత్ర పై ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని అనుసరించి సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు అరెస్టు చేస్తారని భావించి ముందస్తు బెయిల్ తెచ్చుకునే పనిలో పడ్డారు. సోమవారం కోర్టులో విచారణ జరగనున్నందున.. అంతకంటే ముందే అరెస్టు చేస్తారా? లేదా? అన్నది తెలియాలి.