YS Jagan Mohan Reddy :  జగన్ దేవుడినే నమ్ముకుంటే కష్టం!

మాజీ సీఎం జగన్ లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. పోరాట పటిమ తగ్గింది. అధికారంలో ఉన్నప్పుడు ఆయనే టార్గెట్. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే టార్గెట్ అవుతున్నారు. తిప్పి కొట్టడంలో ఫెయిల్ అవుతున్నారు.

Written By: Dharma, Updated On : September 21, 2024 11:19 am

YS Jagan Mohan Reddy

Follow us on

YS Jagan Mohan Reddy : రాజకీయాన్ని రాజకీయంలో చేయాలి. రాజకీయాన్ని వ్యాపారంలా చేస్తే దుష్పరిణామాలు అధికం.ఇప్పుడు జగన్ విషయంలోఅదే జరుగుతోంది. జగన్ ను తప్పుడు మనిషిగా చిత్రీకరించడంలో అప్పట్లో ఉన్న ప్రతిపక్షం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా ప్రచారం జరుగుతోంది.అప్పుడు బాధితుడు ఆయనే. ఇప్పుడు కూడా బాధితుడు ఆయనే.ప్రకాశం బ్యారేజీకి పడవలతో ఢీ కొట్టించింది వైసిపినే . ముంబై నటిని వేధించింది వైసిపినే. ఇప్పుడు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపింది వైసిపి నే. ఇలా వరుస విమర్శలు వస్తున్నా.. జగన్ మాత్రం తిప్పి కొట్టడం లేదు.ప్రజల్లోకి వచ్చి తన వాయిస్ ను వినిపించడం లేదు.కనీసం ఆధారాలు చూపించమని అడగడం లేదు. ఇప్పటికీ అదే డైలాగులు వాడుతున్నారు.అంతా దేవుడు చూసుకుంటాడుఅన్నట్టు మాట్లాడుతున్నారు.అయితే జగన్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

* అప్పట్లో లెక్క చేయలేదు
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా జరిగిపోయేది. అప్పట్లో ప్రతిపక్షాలను లెక్కచేయలేదు. ప్రజలకు అన్నీ చేస్తున్నాను.. అన్నీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాల విమర్శలను పరిగణలోకి తీసుకోలేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఓటర్లు ఉన్నారని భావించారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వారు తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తారని భ్రమించారు. అయితే నాడు ప్రతిపక్షాలు జగన్ పై చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసీపీకి దారుణ పరాజయానికి కారణమైంది.

* ప్రతిపక్షంలోకి వచ్చినా ప్రశ్నించరే!
అయితే ప్రతిపక్షంలోకి వస్తేప్రశ్నించే తత్వం వస్తుందని అంతా భావిస్తారు.కానీ ఇప్పుడు కూడా వైసీపీయే అధికారపక్షానికి టార్గెట్ అవుతుండడం విశేషం. ఏపీలో జరిగే ప్రతి ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని అధికార పక్షం ఆరోపిస్తోంది. అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. దీనిని తిప్పి కొట్టాల్సిన జగన్ నోరు మెదపడం లేదు. గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదు. సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరిట ఒక కథనంతో సరిపెడతారు. ఎవరో తెలియని వైసిపి అధికార ప్రతినిధితో మాట్లాడించి మమ అనిపించేస్తారు. అంతకుమించి ఖండన ఉండడం లేదు. రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయడం లేదు. మీరు చెబుతున్నది తప్పు అని చెప్పడం లేదు. దీంతో జగన్ అనే వ్యక్తి మంచివాడు కాదు అని ప్రచారం చేయడంలో ప్రత్యర్ధులు సక్సెస్ అవుతున్నారు.

* అదే నిస్సహాయత
అప్పుడు, ఇప్పుడు జగన్ దేవుడిని నమ్ముకుని ఉన్నట్టు ఉన్నారు. అందుకే తన నిస్సహాయతను దేవుడిపై పెడుతున్నారు. అంతా దేవుడే చూసుకుంటాడులే అని భావిస్తున్నారు. ఇది పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. జగన్ తీరు నచ్చక, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేక చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. అందులో జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. కుటుంబ శ్రేయోభిలాషులు ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీతో బాగుపడిన వారు ఉన్నారు. మొత్తానికైతే జగన్ రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయకుంటే మాత్రం.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం. ఈ విషయం జగన్ గుర్తించకపోతే ఆయనకే నష్టం.