TDP Vs Janasena: విశాఖ నగరంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఎంతో ఫేమస్. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. కానీ ఈసారి ఉత్సవ కమిటీ కూడా వేయలేని పరిస్థితిలో దేవాదాయ శాఖ ఉంది. ఈ ఆలయం విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టిడిపి ఇన్చార్జిగా సీతంరాజు సుధాకర్ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నవారే. వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉండేవారు. సీతం రాజు సుధాకర్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. అయితే ఇద్దరూ ఎన్నికలకు ముందు వైసీపీని వీడారు. వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి పొత్తులో భాగంగా టికెట్ దక్కించుకున్నారు. సీతం రాజు సుధాకర్ టీడీపీలో చేరి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి పొందారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. దాని ప్రభావం కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం పై పడింది. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోలేని స్థితిలో దేవాదాయ శాఖ ఉండడం విమర్శలకు తావిస్తోంది.
* వేర్వేరుగా జాబితాలు
ఉత్సవ ఏర్పాట్లలో దేవాదాయ శాఖ నిమగ్నమైంది. టిడిపి ఇన్చార్జిగా ఉన్న సీతం రాజు సుధాకర్ ఉత్సవ కమిటీ జాబితా ఇచ్చారు. అందులో టిడిపి వారితో నింపేశారు. ఎమ్మెల్యే గా ఉన్న అధికారిక హోదాలో వంశీకృష్ణ మరో జాబితా ఇచ్చారు. దీంతో దేవాదాయశాఖ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఈసారి ఉత్సవ కమిటీ వేయకుండా అమ్మవారి పండుగను జరిపిస్తున్నారు. అయితే ఇది ఒక్క వ్యవహారంలోనే కాదు.. దాదాపు అధికారిక కార్యక్రమాలన్నింటిలోనూ ఆ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరికి వారే పంతానికి పోతుండడంతో అధికారులకు ఇబ్బందిగా పరిగణించింది.
* టిడిపికి పట్టు
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఇక్కడ టిడిపి అభ్యర్థి గెలుపొందారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే కొద్ది కాలానికి వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో ఇక్కడ టిడిపికి బలమైన నాయకుడు అవసరం అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా జనసేనతో పొత్తు కుదిరింది. చివరి నిమిషంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన టికెట్ దక్కించుకున్నారు. దీంతో టీడీపీ నేతలు నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించిన సీతంరాజు సుధాకర్ కు షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు జగన్ టిక్కెట్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన సీతం రాజు సుధాకర్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2029 ఎన్నికల్లో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్ కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. జనసేన ను సౌత్ నియోజకవర్గం లో మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. దీంతో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంటోంది. మధ్యన యంత్రాంగం నలిగిపోతోంది.