AP New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో లక్షలాదిమంది అర్హులు దరఖాస్తులు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు సైతం ఎంతో ఆనందించారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం రాలేదు. అయితే రేషన్ కార్డుల డిజైన్ల మార్పుపై అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. సాధారణంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డుల డిజైన్లు మారుతాయి. అయితే పనిలో పనిగా కొత్త రేషన్ కార్డుల జారీ పూర్తయితే.. ఒకేసారి రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేయాలని అధికారులు ఆలోచన చేశారు. ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో రేషన్ కార్డు దరఖాస్తు దారులలో ఒక రకమైన అయోమయం కనిపిస్తోంది. ఇంకోవైపు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి.
* ప్రకటనలకే పరిమితం
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సంక్రాంతి నాటికి కొత్త కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పాత కార్డులను తొలగించి కొత్త కార్డులు అందిస్తామని కూడా ప్రకటించారు. కొత్త కార్డుల డిజైన్ పై కసరత్తు జరుగుతోందని కూడా వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.
* 19న ఫుల్ క్లారిటీ
అయితే పతాకస్థాయిలో ప్రచారం జరుగుతున్నా.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేకుండా పోతోంది. అయితే కొత్త కార్డుల డిజైన్ పై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారడంతో ఇప్పుడు పథకాల లబ్ధిదారులు.. కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు ఏ విషయం తేలే అవకాశం లేదు.