https://oktelugu.com/

NTV vs TV9: ఎన్టీవీని మళ్లీ కొట్టేసిన టీవీ9.. ఈసారి ఎలాంటి ఫ్లెక్సీలు పెడుతుందో..

మళ్లీ ఇన్ని రోజులకు టీవీ9 మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడాలి. అప్పట్లో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నప్పుడు కుట్రలు అని ప్రచారం చేసిన టీవీ9..

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 5, 2024 2:09 pm
    TV9-beat-NTV-again

    TV9-beat-NTV-again

    Follow us on

    NTV vs TV9: ఆ మధ్య ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చినప్పుడు టీవీ9 రెండు తెలుగు రాష్ట్రాల్లో బొంబాట్ ప్రచారం చేసింది. కుట్రలతో నెంబర్ వన్ స్థానం దక్కించుకోలేరంటూ ఫ్లెక్సీలలో పేర్కొన్నది. దీనికి కౌంటర్ గా ఎన్టీవీ “విశ్వసనీయతే మా ప్రధాన బలం.. మాది ప్రజాగళం” అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇలా కొద్దిరోజులపాటు నెంబర్ వన్ స్థానంలో ఎన్టీవీ కొనసాగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు టీవీ9 మళ్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అప్పుడు నెంబర్ వన్ స్థానం కోల్పోయినప్పుడు కుట్రలు అంటూ ప్రచారం చేసిన టీవీ9.. ఈసారి మొదటి స్థానానికి రాగానే ఆఫీసులో కేక్ లు కట్ చేసింది. రజనీకాంత్ నుంచి మొదలు పెడితే దేవి నాగవల్లి వరకు ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయాలను తెలిపారు. మళ్లీ ఆ నెంబర్ వన్ స్థానం టీవీ9 కు మూడు నాళ్ళ ముచ్చటే అయ్యింది.

    మళ్లీ ఇన్ని రోజులకు టీవీ9 మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడాలి. అప్పట్లో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నప్పుడు కుట్రలు అని ప్రచారం చేసిన టీవీ9.. ఇప్పుడు ఎలాంటి కుట్రలు చేస్తే మొదటి స్థానం లోకి వచ్చి ఉంటుంది? ఎలాంటి తెర వెనుక ప్రయత్నాలు చేస్తే మొదటి స్థానాన్ని ఆక్రమించి ఉంటుంది? దీనికి రజనీకాంత్ సమాధానం చెప్పగలుగుతారా? లేక దాని ఓనర్స్ మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? మరో పార్టనర్ మెఘా కృష్ణారెడ్డి తన స్పందన తెలియజేస్తారా? అసలు ఈ నెంబర్ వన్ ర్యాంక్ అనేది పెద్ద మాయాజాలం. పత్రికలకు ఇచ్చే ఏబీసీ రేటింగ్స్ లో ఎంతటి మాయాజాలం ఉంటుందో.. చానల్స్ కు ఇచ్చే బార్క్ రేటింగ్స్ లోనూ అంతటి మాయే దాగి ఉంటుంది. ఎక్కడ మీటర్లు ఏర్పాటు చేస్తారో, ఎక్కడ ఎలాంటి మాయాజాలం ప్రదర్శిస్తారో ఇప్పటికీ అది చిదంబర రహస్యమే. అక్కడిదాకా ఎందుకు గత ఏడాది రిపబ్లిక్ టీవీ విషయంలో ఏం జరిగిందో చూశాం కదా.. ఏకంగా ఆ ఛానల్ టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఆజ్ తక్ వంటి చానెల్స్ ను దాటేసి ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. దీని వెనుక ఏం జరిగి ఉంటుంది అని ఆరా తీస్తే అసలు విషయం అప్పుడు తెరపైకి వచ్చింది. ఫలితంగా బార్క్ రేటింగ్స్ ఎంత పెద్ద దందానో అందరికీ అవగతం అయింది. సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం తెలుగు నాటకూడా బార్క్ రేటింగ్స్ అంత సచ్చిలంగా ఉండవని తెలుస్తోంది.

    ఇక తాజా బార్క్ రేటింగ్స్ విషయానికొస్తే టిడిపి క్యాంపుకు పెద్దగా మింగుడు పడని రేటింగ్స్ ఇవి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలవేళ ఇలాంటి రేటింగ్స్ వస్తాయని ఆ పార్టీ అనుకూల మీడియా ఊహించి ఉండదు. ఇక తాజా రేటింగ్స్ లో టీవీ9 మొదటి స్థానంలోకి వచ్చేసింది. గత నెలలో 71.3 రేటింగ్ నమోదు చేసిన టీవీ9.. ఈ నెలలో ఇప్పటివరకు 71.5 రేటింగ్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎన్ టీవీ గత నెలలో 64.2 రేటింగ్స్ నమోదు చేసింది. ఈ నెలలో అది 65.4 కు చేరుకుంది. అనూహ్యంగా ఈ జాబితాలోకి సాక్షి మూడవ స్థానానికి చేరుకుంది. ఇది టిడిపి క్యాంపుకు మింగుడు పడని విషయం. టిడిపి భజన చేసే టీవీ5 నాలుగో స్థానానికి చేరుకుంది. ఈటీవీ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. పసుపు భజనలో తనదైన ట్రేడ్ మార్క్ ప్రదర్శించే ఏబీఎన్ ఆరవ స్థానానికి పడిపోయింది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నాలుగో స్థానంలో కొనసాగిన v6 ఇప్పుడు ఏడవ స్థానానికి పడిపోయింది. టీవీ9 యజమానులకు చెందిన మరో న్యూస్ ఛానల్ టెన్ టీవీ 8వ స్థానంలో కొనసాగుతోంది. గులాబీ భజన చేసే టీ న్యూస్ 9వ స్థానంలోకి పడిపోయింది. మహా న్యూస్ 10వ స్థానంలో ఉంది. ఈటీవీ తెలంగాణ 11వ స్థానం, ఐ న్యూస్ 12వ స్థానం, రాజ్ న్యూస్ 13వ స్థానంలో కొనసాగుతున్నాయి.

    ఇక హైదరాబాద్ పరంగా రేటింగ్స్ చూసుకుంటే టీవీ9 మొదటి స్థానంలో కొనసాగుతోంది.. ఇక్కడ యాదృచ్ఛికంగా టీవీ5 రెండవ స్థానానికి వచ్చేసింది. మూడవ స్థానంలో ఎన్టీవీ కొనసాగుతోంది. నాలుగవ స్థానంలో వి6, ఐదవ స్థానంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి… ఇక మిగతా స్థానాల్లో ఇతర చానల్స్ కొనసాగుతున్నాయి.. స్థూలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే టీవీ9 మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో ఎన్టీవీ ఉంది. మూడవ స్థానంలో సాక్షి కొనసాగుతోంది. అదే హైదరాబాద్ పరంగా చూసుకుంటే సాక్షి చివరి వరుసలో ఉంది.