AP TET: ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు ఉన్నపలంగా పరీక్షకు సిద్ధపడుతున్నారు. ఉపాధ్యాయులుగా నియమితులై.. దశాబ్దాల తరువాత ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాల్సి రావడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పని సరిచేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు టెట్ రాయాలనుకుంటున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అవకాశం ఇస్తూ.. అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
* కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ..
ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా 3461 ఇన్ సర్వీస్ ఉద్యోగులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. 2010 ముందు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఏ హోదాలో ఉంటే ఆ హోదాకు తగ్గట్టు టెట్ పేపర్ రాసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇన్ సర్వీసులో ఉన్న టీచర్లకు అకాడమీ అర్హత మార్కుల్లో సడలింపులు ఉన్నాయి. కానీ టెట్ అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో టెట్ రాసే ఉపాధ్యాయులకు సబ్జెక్టు సిలబస్ సవాల్ గా మారుతోంది. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉపాధ్యాయులందరూ ఒక్కో సబ్జెక్టును బోధిస్తున్నారు. కానీ టెట్ కు లాంగ్వేజెస్ తో సహా అన్ని సబ్జెక్టులకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఒకవైపు బోధన..
ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువమంది ఏదో ఒక సబ్జెక్టు నే ఆరు నుంచి పది తరగతులకు బోధిస్తున్నారు. బయాలజీ టీచర్లకు వారి సబ్జెక్టుకు సంబంధించిన టెట్ లో 20 మార్కులకే ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు పిల్లల అభివృద్ధి, పెడగాజి 30 మార్కులకు, మాతృభాష 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, గణితం 20 మార్కులు, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి 20 మార్కులు కలిపి మొత్తం 13 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు ఈ పరీక్షలకు సన్నద్ధతలో ఉన్నారు ఉపాధ్యాయులు.
* రివ్యూ పిటిషన్ దాఖలు..
అయితే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఉపాధ్యాయులపై ఈ పరీక్ష నిర్వహణపై ఎటువంటి ఒత్తిడి లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ పరంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు కొంతమంది ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా రివ్యూ పిటిషన్ వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఈ రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.