Jagan CBI Court: అక్రమాస్తుల కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) బెయిల్ పై ఉన్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పైనే కొనసాగుతున్నారు. 2012లో అక్రమాస్తుల కేసుల్లో ఆయన అరెస్టయ్యారు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత బెయిల్ దక్కించుకున్నారు. అయితే ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉండేది. 2019 ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగింది. ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నందున.. ఆయనకు కోర్టు హాజరు విషయంలో మినహాయింపు లభించింది. అయితే ఇప్పుడు మరోసారి ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే విషయంపై సీబీఐ కోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది.
* కోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు( foreign tour) వెళ్లిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు కావడంతో.. ఆయన సిబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. కోర్టు సైతం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన సరైన ఫోన్ నెంబర్ సమర్పించలేదని చెబుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చారు. దీంతో ముగిసిన అధ్యయనం గా తేల్చి చెప్పింది సిబిఐ కోర్టు. అయితే నవంబర్ 14న కోర్టుకు రావాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
* గతంలోనే సంకేతాలు..
అయితే గతంలో విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతించినప్పుడే కోర్టు కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేసింది. పూర్తిగా ప్రైవేటు పర్యటన కోసం ఆయన లండన్( London) వెళ్లారు. దానిని గుర్తు చేస్తూ ఈసారి కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. నవంబర్ 14న శుక్రవారం కావడంతో ఆరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. అయితే కోర్టుకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం కోర్టుకు హాజరు కాకుండా మరికొన్ని మినహాయింపులు తమవైపు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కోర్టు గట్టిగా చెబితే మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంలో సిబిఐ గట్టిగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.