AP Temperature : ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో అయితే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గాలిలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కోస్తాలో మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలాచోట్ల సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందని.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అయితే మేలో ఎండల పరిస్థితి తలచుకొని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read : ఏపీలో వాతావరణం అస్పష్టం.. ఒక్కో జిల్లాలో ఒక్కోలా!
* సంక్రాంతి నుంచి అదే పరిస్థితి..
ఈ ఏడాది సంక్రాంతి తరువాత ఎండల తీవ్రత అధికంగా ఉంటూ వస్తోంది. అయితే క్రమేపీ ఉష్ణోగ్రతలు( temperature) పెరుగుతూ రాగా.. ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తొలిసారిగా తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. నంద్యాల జిల్లా ఆవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగిరి, ప్రకాశం జిల్లా పొనుగోడులో 42.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 42.4, పల్నాడు జిల్లా వినుకొండ, కడప జిల్లా ఉప్పలూరు లో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా.. అన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో మాత్రం చెప్పనవసరం లేదు.
* కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
మరోవైపు మధ్యప్రదేశ్( Madhya Pradesh ) నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి, ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణం లో అస్పష్టత కొనసాగుతోంది. కోస్తా తో పాటు రాయలసీమలో వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
* ఉత్తరాంధ్రకు సూచన..
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, విశాఖ జిల్లాలోని 31 మండలాల్లో తీవ్రంగా, 20 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జూన్లో రుతుపవనాల కదలిక బట్టి ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అయితే మేలో మాత్రం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.