AP School Bus Green Tax: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో గత ప్రభుత్వ నిర్ణయాలను పున సమీక్షిస్తోంది. ముఖ్యంగా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూనే.. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ విషయంలో సైతం కొన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతిమంగా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా స్కూల్ బస్సులపై గ్రీన్ టాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలల బస్సులపై గ్రీన్ టాక్స్ రూపంలో భారీగా భారం ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా తొలగించింది.
Also Read: Car Tax: మనం ఒక కారు కొంటే ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ వెళుతుందో తెలుసా?
పవన్ కళ్యాణ్ చొరవతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో అన్ని రకాల వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించబడింది. ఒక విధంగా చెప్పాలంటే రవాణా రంగాన్ని ఇది దెబ్బతీసింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రెట్టింపు గ్రీన్ టాక్స్ వసూలు చేశారు ఏపీలో. అప్పట్లో కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ లారీ డ్రైవర్ ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. ఏపీలో గ్రీన్ టాక్స్ పేరిట దోపిడీ జరుగుతోందని.. దీంతో తమకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా వాహనాలకు ఏడేళ్ల కాల పరిమితి దాటితే గ్రీన్ టాక్స్ అప్పట్లో అమలు చేశారు. అయితే మూడువేల రూపాయల వరకు ఉన్న గ్రీన్ టాక్స్ ను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు రెట్లకు పెంచింది. ఏకంగా 15 వేల రూపాయలు గ్రీన్ టాక్స్ రూపంలో పెరిగింది. అయితే మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గ్రీన్ టాక్స్ పూర్వస్థితికి తెస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Budget 2025: ఆదాయపన్ను మార్పులు – సామాన్య పౌరులకు ఊరట వచ్చేలా మార్గదర్శకాలు?
గ్రీన్ టాక్స్ రద్దు..
ఇప్పుడు తాజాగా ప్రైవేటు స్కూల్ బస్సులపై గ్రీన్ టాక్స్( green tax) రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్ బస్సులపై భారీగా గ్రీన్ టాక్స్ విధించింది.
అయితే అది అంతిమంగా విద్యార్థుల ఫీజులపై పడింది. రవాణా చార్జీల రూపంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు భారీగా వసూలు చేశాయి. అయితే కొన్ని పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక విన్నపం చేసినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. తాజాగా సీఎం చంద్రబాబు గ్రీన్ టాక్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కాలేజీ వాహనాలకు జగన్ హయాంలో విధించిన గ్రీన్ టాక్స్ ను పూర్తిగా రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. కరోనా లాంటి కష్టకాలంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ టాక్స్ వసూలు చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల పై భారం పడకుండా ఉండేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూల్ బస్సులపై గ్రీన్ టాక్స్ రద్దు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పై పాఠశాలల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.