Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income Tax), గృహ రుణాల ప్రోత్సాహకాలు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EVs), క్రిప్టోకరెన్సీ, పొదుపు ప్రోత్సాహకాలు తదితర రంగాల్లో మార్పులపై తీవ్ర చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమయానికి ముందు పన్ను నిపుణులు పలు సూచనలు అందించారు. వీటిలో పన్ను దాయదారులకు ప్రయోజనం కలిగించే విధంగా పన్ను స్లాబ్‌ల మార్పులు, పెన్షన్ ఫండ్, ఆరోగ్య భద్రత, క్యాపిటల్ గెయిన్స్ మొదలైన అంశాలు ఉన్నాయి.
ఇన్‌కమ్ టాక్స్ మార్పులు – కీలక సిఫార్సులు
1) ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపు
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షల వరకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. రూ.10 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని ఆశించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ClearTax నిపుణురాలు షెఫాలీ ముండ్రా సూచన ప్రకారం, రూ.15 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను తగ్గించాలనీ, తద్వారా ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థలో వినియోగం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
2) గృహ రుణాల్లో పన్ను మినహాయింపు పెంపు
కొత్త పన్ను విధానంలో గృహ రుణదారులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సూచనలు ఉన్నాయి. సెక్షన్ 24(b) ప్రకారం, హౌసింగ్ లోన్‌పై వడ్డీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని Dewan P.N. Chopra & Co. మేనేజింగ్ పార్ట్‌నర్ ధ్రువ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
3) NPS (పెన్షన్ ఫండ్) మినహాయింపు పెంపు
ట్యాక్స్2విన్ సీఈవో అభిషేక్ సోనీ సూచన ప్రకారం, నేషనల్ ఫెన్షన్ స్కీంలో అదనపు మినహాయింపు పరిమితిని రూ.50,000 నుండి రూ.1,00,000కు పెంచాలి. అంతేగాక, NPS విత్ డ్రా పై పూర్తిగా పన్ను మినహాయింపు (EEE Treatment) వర్తింపజేయాలని సూచించారు.
4) రెంటల్ అలవెన్స్ (HRA) పెంపు
హైదరాబాద్, బెంగుళూరు, పుణే వంటి అధిక ఖర్చుతో కూడిన నగరాల్లో జీవిస్తున్న మధ్య తరగతి వర్గం కోసం HRA మినహాయింపును 50శాతం వరకు పెంచాలని సూచనలు ఉన్నాయి.
5) ఆరోగ్య భద్రతపై పన్ను మినహాయింపు పెంపు (Sec 80D)
నిపుణురాలు షెఫాలీ ముండ్రా ప్రకారం, అందరికీ ఆరోగ్య భద్రత ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, సెక్షన్ 80D కింద మినహాయింపును రూ.25,000 నుండి రూ.50,000కు, వృద్ధులకు రూ.50,000 నుండి రూ.1,00,000కు పెంచాలి.
6) పీఎఫ్ వడ్డీపై పన్ను తగ్గింపు
ప్రస్తుతం రూ.2.5 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ వడ్డీపై పన్ను (TDS) విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ పన్నును ఉపసంహరణ సమయంలో మాత్రమే వసూలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
7) క్యాపిటల్ గెయిన్స్ పన్ను (Capital Gains Tax) సరళీకరణ
బీడీవో ఇండియా నిపుణుడు నిరంజన్ గోవిందేకర్ అభిప్రాయం ప్రకారం, ఇండియన్ & ఇంటర్నేషనల్ స్టాక్స్‌పై ఒకే విధమైన పన్ను విధించాలి. స్వల్పకాలిక (Short-Term) పన్ను 15శాతం నుంచి 20శాతానికి పెంచిన తర్వాత, స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పూర్తిగా తొలగించాలంటూ సూచనలు ఉన్నాయి.
8) వృద్ధుల కోసం అధిక పన్ను మినహాయింపు
సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచి, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని పన్ను నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
9) Sec 80C లో పెట్టుబడుల పరిమితి పెంపు
ప్రస్తుతం Sec 80C మినహాయింపు పరిమితి రూ.1.50 లక్షలుగా ఉంది, ఇది 2014 నుండి మారలేదు. దీన్ని రూ.2.50 లక్షల వరకూ పెంచి, PPF, ట్యాక్స్-సేవింగ్ ఎఫ్ డీ, ఇతర పొదుపు పథకాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న సూచనలు ఉన్నాయి.
సామాన్య పౌరులకు ఎంతవరకు లాభం?
ఈ సిఫార్సులు అమలైతే మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, వృద్ధులకు భారీ స్థాయిలో పన్ను ఊరట లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు పెరుగుదల, గృహ రుణ పన్ను తగ్గింపులు, NPS & HRA సబ్సిడీలు వంటి అంశాలు ప్రజల ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పించనున్నాయి.
మోదీ ప్రభుత్వ తుది నిర్ణయం ఏంటీ?
2025 బడ్జెట్‌లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సూచనలను ఎంతవరకు స్వీకరిస్తారనేది ఫిబ్రవరి 1న వెల్లడికానుంది. మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపే ఈ కీలక నిర్ణయాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.