Allu Arjun: గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ చర్చకు దారి తీశారు. ఎన్నికలకు ముందు ఆయన చిన్న పార్టీ చర్య పెను దుమారానికి దారితీసింది. సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వివాదానికి కారణమైంది. మెగా కుటుంబమంతా జనసేన తో పాటు కూటమికి మద్దతుగా ఉండగా.. అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి సంఘీభావం తెలపడం సంచలనాలకు దారితీసింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ పాటతో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ సినిమా నుంచి తాజాగా కిస్సిక్ అనే పాటను విడుదల చేశారు. నేటి రాజకీయాలపై ఉద్దేశపూర్వకంగా ఆ పాట రాయించినట్లు చర్చ జరుగుతోంది.సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. జాతీయస్థాయిలో అల్లు అర్జున్ నటనకు గుర్తింపు లభించింది. జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు దక్కేలా చేసింది.ఇండియన్ ఐకానిక్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో పుష్ప2 చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముంగిటకు రానుంది. ఈ తరుణంలో ఆదివారం విడుదల చేసిన కిస్సిక్ పాట సంచలనంగా మారింది.
* రాజకీయాలకు దగ్గరగా
అయితే ఈ కిస్సిక్ సాంగ్ ఏపీ రాజకీయాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ జరిగిన పరిణామాలను ఉదహరించినట్టు ఉంది. అలా చేస్తే దెబ్బలు పడతాయి అని హెచ్చరించినట్లు ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, రచయిత చంద్రబోస్ తన సాహిత్యంతో ఏపీ రాజకీయ నేతలను హెచ్చరించినట్లు ఉంది. గాయని సుబ్లాషిని పాడిన పాట.. రెండు మూడు చరణాల్లో ఏపీ రాజకీయాలను, ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.
*పబ్లిక్ లోనా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్లు సేసారో దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో* అంటూ రెండో చరణం లో వీఐపీల ఫోటోలపై నెటిజన్లు చేస్తున్న అసభ్య కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉన్నాయి.
ఆఖరి చరణం లో ఏపీలో రాజకీయ నాయకుల పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
*తీసిన ఫోటో దాసుకో.. తీరుబడిగా సూసుకో.. కళ్ళకు పండుగ సేసుకో కాదనేది లేదు… కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసారో దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో.. కిస్ కిస్ కిస్సిక్.. కిస్సా కిస్సా కిసిక్* అంటూ రాజకీయ నాయకుల ఫోటోలు తీసి మార్పింగులు చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిని హెచ్చరించినట్లు ఉంది. మొత్తానికైతే ఏపీలో జరుగుతున్న పరిణామాల సందర్భానుసారం వచ్చిన ఈ పాట హైప్ క్రియేట్ చేస్తోంది.