AP People Owe Gratitude to Modi?: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. కేంద్రంలో టిడిపి, రాష్ట్రంలో బిజెపి భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు వారధిగా జనసేన ఉంది. అయితే గతం కంటే ఎక్కువగా ఏపీకి కేంద్రం ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. అయితే గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి కేంద్రం ఏపీకి ప్రాధాన్యమిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. కేంద్రంలో ఎన్డీఏ మూడో స్థాయి అధికారంలోకి రావడానికి తగిన బలం ఏపీ నుంచి ఉంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. 21 చోట్ల కూటమి విజయం సాధించింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమైంది. అందుకే ఏపీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది.
రాజకీయ కారణాలతో..
2014లో తొలిసారిగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ( NDA)అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్గా అవతరించింది. అయితే నాడు ఎన్డీఏ భాగస్వామిగా టిడిపి ఉండేది. కానీ నాడు బిజెపికి ఏకపక్ష బలం ఉండేది. దీంతో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. మరోవైపు అప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ పతాక స్థాయిలో ఉండేది. దీంతో టీడీపీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడింది. బలమైన ప్రతిపక్షంగా ఉండే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒత్తిడి పెంచింది. దీంతో కేంద్రం నుంచి నిధుల కంటే ప్రత్యేక హోదాకు చంద్రబాబు పట్టుబట్టారు. ఈ క్రమంలో కేంద్రంతో రాజకీయ విభేదాలు వచ్చాయి. దీంతో ఉన్నఫలంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా దక్కకపోగా న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ఏపీకి రాకుండా పోయాయి.
Also Read: AP People : ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రం..!
కేంద్రం నుంచి అధికంగా నిధులు
అయితే ఈసారి అలా కాదు. కేంద్రంలో ఇప్పుడు టిడిపి( Telugu Desam Party) కీలక భాగస్వామి. ఏపీలో సైతం బిజెపికి ఛాన్స్ ఇచ్చింది టిడిపి. మరోవైపు వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. అధిక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. మోడీ సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే కేటాయింపులు అధికంగా చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 12 వేల కోట్లు ఇచ్చారు. రాజ్యాంగబద్ధ చెల్లింపులు చేస్తున్నారు. ఆర్థిక సంఘ నిధులు విడుదల చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులు పెండింగ్లో పెట్టకుండా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను పెద్ద ఎత్తున కేటాయిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క విశాఖలోనే రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకారం చుట్టారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా నిధులు విడుదల చేయడమే కాకుండా ప్రాజెక్టుల రూపంలో కేటాయింపులు చేస్తుండడం విశేషం.
బండి సంజయ్ సంచలన కామెంట్స్
అయితే ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేత బండి సంజయ్( Bandi Sanjay ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ప్రధాని మోదీకి రుణపడి ఉండాలంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే దేశంలో అత్యధికంగా కేంద్రం నిధులు కేటాయించింది ఏపీకేనని చెబుతున్నారు. 95 వేల కోట్లు నేరుగా కేటాయించారని.. పరోక్ష కేటాయింపులు సైతం ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఏడాది కాలంలో ఈ తరహా కేటాయింపులు చేస్తే.. అంతకుముందు పదేళ్లపాటు ఇలానే వ్యవహరించి ఉంటే ఏపీ అగ్ర పధంలో ఉండేది. ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ పై సెటైర్లు పడుతున్నాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి.