AP New National Highway : ఏపీకి( Andhra Pradesh) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక రంగంతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి గాను గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటు చేయనుంది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ పోర్టు నుంచి భీమిలి వరకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. పోర్టుకు అనుసంధానంగా ఉండి పర్యాటకాన్ని, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడనుంది. సుమారు 200 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే తో మూడు జిల్లాలకు మేలు జరగనుంది. ముఖ్యంగా మత్స్యకారుల వెతలు తీరనున్నాయి. మత్స్యకారులు వేటాడే చేపలకు రవాణా, మార్కెట్ సదుపాయం జరగనుంది.
Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని?
* సీఎం చంద్రబాబు విన్నపం..
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం లో నిర్మాణంలో ఉంది మూలపేట పోర్టు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మీదుగా భీమిలి వరకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హైవేకు సంబంధించి డిపిఆర్ తయారీ, భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎయిర్ పోర్టుతో కనెక్టివిటీ..
తీర ప్రాంతం వెంబడి నిర్మించే ఈ జాతీయ రహదారితో( National Highway) మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేయవచ్చు. విశాఖ నుంచి భీమిలి వరకు జాతీయ రహదారి ఉంది. భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. అదే సమయంలో మూలపేట పోర్టుకు ఆరులేన్ల రహదారి అవసరం అని గుర్తించారు. అందుకే భోగాపురం ఎయిర్ పోర్టుకు, మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే పనిలో పడ్డారు. విశాఖకు తీర ప్రాంతం వెంబడి సులువుగా చేరుకునేందుకు ఈ హైవే దోహదపడనుంది. ఆక్వా రంగం అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకంగా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ప్రత్యేక పరిగణలోకి తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం వీలైనంత త్వరగా పట్టాలెక్కనుంది.
Also Read : కొడాలి నాని వర్సెస్ చంద్రబాబు.. గుడివాడలో రచ్చ రంబోలా.. ఏం జరుగుతోంది?
కేంద్రమంత్రి ప్రత్యేక చొరవ..
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapur Ram Mohan Naidu) కేంద్రమంత్రిగా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కీలకమైన పౌర విమానయాన శాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఆయన పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మూలపేట పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కోస్టల్ నేషనల్ హైవే ఆవశ్యకత గురించి కేంద్రానికి వివరించారు. సుమారు 200 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవే కు సంబంధించి భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ హైవేకు సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రారంభం కానుంది. సువిశాల తీర ప్రాంతం ఉత్తరాంధ్ర సొంతం. ఈ కొత్త ప్రాజెక్టుతో పర్యాటకంగా సైతం ఉత్తరాంధ్ర అభివృద్ధి కానుంది.