Chandranna Pelli Kanuka: ఆడపిల్లలకు బాబు వరం.. అకౌంట్లోకి ఎన్ని డబ్బులు అంటే?

గత ప్రభుత్వం అమలు చేసిన వైయస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని.. చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు. మైనారిటీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును కూడా మార్చేశారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 1:25 pm

Chandranna Pelli Kanuka

Follow us on

Chandranna Pelli Kanuka: సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటి అమలుకు నిర్దిష్టమైన కాల పరిమితిని కూడా నిర్ణయించారు. మరోవైపు సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచి ఈ పెంచిన మొత్తాన్ని వర్తింపజేశారు. జూలై 1న సచివాలయ ఉద్యోగులకు పింఛన్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజే పూర్తిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుతూ.. పక్కాగా ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నారు.

అందులో భాగంగా కీలకమైన రెండు పథకాలకు పేర్లు మార్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన వైయస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని.. చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు. మైనారిటీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును కూడా మార్చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనారిటీస్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రన్న పెళ్లి కానుకను పక్కగా అమలు చేశారు చంద్రబాబు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేసింది. చివరిగా ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే అమలు చేసింది. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే పెళ్లి కానుక అందించినట్లు తెలుస్తోంది.

తొలి మూడు సంవత్సరాల పాటు జగన్ సర్కార్ రకరకాల కారణాలు చెబుతూ పెళ్లి కానుక స్కీమ్ ను అమలు చేయలేక పోయింది. ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో వివాహాలు చేసిన కుటుంబాలకు ఆర్థికపరమైన భరోసా లేకుండా పోయింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో జగన్ సర్కార్ మేల్కొంది. ఎస్సీ,ఎస్టీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇవ్వగా.. కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు ఇచ్చారు. అలాగే బీసీలకు 50,000. అందులో కులాంతర వివాహాలకు 75000, అదేవిధంగా మైనారిటీలకు లక్ష రూపాయలు, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు ఇచ్చారు.అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వబోతున్న చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా సాయం అందేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.