Minister Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 1:20 pm

Minister Ponguleti Srinivasa Reddy

Follow us on

Minister Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు కలకలం సృష్టించాయి. గురువారం చెన్నై నుంచి వచ్చిన అధికారుల బృందం నేరుగా ఓ మంత్రి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పోలీసులను కాకుండా, కేంద్ర బలగాల బందోబస్తుతో అధికారులు ఆ మంత్రి ఇంటికి వెళ్లారు. మీడియా ప్రతినిధులను లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు ఆ మంత్రి ఇంటికి వెళ్లి సోదాలు మొదలుపెట్టారు… ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు కస్టమ్స్ అధికారులు తనిఖీల కోసం వచ్చారు?

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి 1.7 కోట్లు విలువగల చేతి గడియారాలను సింగపూర్ దేశం నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. హర్షా రెడ్డికి వాచీలు అందజేసిన వ్యక్తిని ఇటీవల కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో అతడు చెప్పిన వివరాల ఆధారంగా అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షా రెడ్డికి నోటీసులు అందజేశారు. ఆ సమయంలో తాను విచారణకు హాజరు కాలేనని హర్షారెడ్డి కస్టమ్స్ అధికారులకు లేఖ రాశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా ఈ కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. ఎన్నికలు పూర్తి కావడం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మరోసారి ఏర్పడటంతో ఈ కేసు మరోసారి తెర పైకి వచ్చింది.

గురువారం హైదరాబాద్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు చేరుకున్నారు. పలు బృందాలుగా వచ్చిన అధికారులు ప్రత్యేక వాహనాలలో మంత్రి ఇంటికి వెళ్లిపోయారు. ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 6 గంటల పాటు తనిఖీలు చేపట్టారు.. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి 1.7 కోట్ల విలువైన చేతి గడియారాలను సింగపూర్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని కస్టమ్స్ అధికారులు అభియోగాలు మోపారు.. అయితే ఆ తనిఖీలలో ఎటువంటి విషయాలు రాబట్టారు? ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా బయటికి పంపించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే అధికారులు వెళ్లిపోయారు.. అయితే ఇటీవల ఓ ఎమ్మెల్యే నివాసంలో కేంద్ర అధికారులు తనిఖీలు నిర్వహించగా.. దాన్ని మర్చిపోకముందే కస్టమ్స్ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది.