AP Government : ఏపీ ప్రభుత్వం( AP government) మరో నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. చెరువులు, జలాశయాల నుంచి పూడిక మట్టిని తరలించుకునేందుకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా చెరువులు, కాలువల్లో పూడిక మట్టి తొలగించడం నిబంధనలకు విరుద్ధం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగునీటి వనరులకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ వెసులుబాటు కల్పించింది. కాలువ పనులు మే నెల చివర్లో పూర్తి చేయాలని గడువు విధించింది. నిర్వహణ పనులకు సంబంధించి రూ. 10 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలానికి ముందే పెద్ద ఎత్తున ఈ పూడికతీత పనులు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : ఏపీ ప్రజలకు ‘జూన్’ ఉపశమనం.. ఆపద సమయాన్ని గట్టెక్కిస్తున్న ప్రభుత్వం!
* సొంత అవసరాలకు..
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు మరమ్మత్తులకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెరువులతో పాటు కాలువల్లో మట్టి, పూడిక తీయాలని నిర్ణయించింది. అయితే ఆ మట్టిని రైతులు తమ సొంత పొలాలకు తరలించేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రైతులు సొంత ఖర్చుతో కూడిక తీసుకుని ఆ మట్టిని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( Executive Engineer) నుంచి అనుమతులు తీసుకోవాలి. చెరువులు, జల వనరుల గట్లపై ఈ పూడిక తీసిన మట్టిని నిల్వ చేయకూడదు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మట్టి అవసరమైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
* సాగునీటి వనరులపై దృష్టి..
ఖరీఫ్( kharif ) ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి వనరుల మరమ్మత్తులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా కాలువల పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. రూ.344 కోట్లతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ లో సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడారు. కాలువల్లో పూడిక తీత, గుర్రపు డెక్క, తూటి కాడ తొలగింపు పనులు చేయాలని మంత్రి చెప్పారు. షట్టర్లు, గేట్ల మరమత్తులు కూడా చేయాలన్నారు. ఈ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని చెప్పుకొచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
* నామినేషన్ పద్ధతిలో పనులు..
మరోవైపు జల వనరుల శాఖ నిర్వహణ పనుల్లో మార్పులు చేసింది. రూ.10 లక్షల వరకు పనులను నామినేషన్( nomination) పద్ధతిలో ఇవ్వడానికి అనుమతించింది. గతంలో ఈ పరిమితి ఐదు లక్షల రూపాయలు వరకు మాత్రమే ఉండేది. వేసవిలో రూ.344.39 కోట్ల విలువైన పనులు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 7174 పనులకు అనుమతి లభించింది. కొన్ని పనులను త్వరగా పూర్తి చేయడానికి టెండర్లు పిలవనున్నారు. మిగిలిన పనులను మాత్రం సాగునీటి సంఘాలకు అప్పగించనున్నారు.
Also Read : ఆర్మీలో చేరడానికి మురళీ నాయక్ పడిన కష్టం ఇది.. తొలి ఇన్ స్టా పోస్టు ఆయనదే!