Annadata Sukhi Bhava: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తోంది. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల్లో రెండు ప్రధాన పథకాలకు నెల రోజుల్లోనే మోక్షం కలగనుంది. మే చివరి వారం తో పాటు జూన్ మొదటి వారంలో రెండు పథకాలు అమలు కానున్నాయి. ఈ రెండు పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో సంతృప్తి శాతం పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులను వార్షిక బడ్జెట్లో సైతం కేటాయింపులు చేశారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేశారు.
Also Read: ఏపీలో ఆ 144 మండలాల్లో.. వాతావరణ శాఖ అలెర్ట్!
* రైతుల ఖాతాల్లో నిధులు..
ప్రధానంగా అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి ఈ నెలలోనే నిధులు జమ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరిట ఈ పథకం అమలయ్యేది. కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయలతో కలిపి.. రైతు భరోసా పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.13,500 అందించేది. అయితే తాము అధికారంలోకి వస్తే సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ నెలలోనే ఆ మొత్తాన్ని అందించనున్నారు. అయితే కేంద్రం 6000 రూపాయలను మూడు విడతల్లో 2000 చొప్పున పిఎం కిసాన్ కింద అందిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ రూ.6000 కు మరో రూ.14000 జత చేసి అందించనుంది. అది కూడా 3 విడతల్లో అందించనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు విడతల్లో ఐదు వేల రూపాయల చొప్పున.. మూడో విడత రూ.4000 అందించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల చివర్లో ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ కానున్నాయి.
* పిల్లల చదువుకు భరోసా..
మరోవైపు విద్యార్థుల చదువుకు ప్రోత్సాహానికి గాను.. తల్లికి వందనం( thallikki Vandanam ) పేరిట నిధులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అమ్మ ఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులను అందిస్తూ వచ్చింది. ప్రతి విద్యార్థికి 15వేల రూపాయల మొత్తం అందిస్తూ రాగా.. ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం చేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే నెల 12న విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదిహేను వేల రూపాయల చొప్పున నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణ కూడా పూర్తయింది. అయితే రెండు విడతల్లో దీనిని అందిస్తారా? ఒక్క విడతలో పూర్తి చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
* జూన్ కష్టాలు గట్టెక్కినట్టే..
సాధారణంగా జూన్ లో ( June) భారీగా పెట్టుబడులు ఉంటాయి. ఈ నెలలోనే ఖరీఫ్ ప్రారంభం అవుతుంది. పొలం పనులు ఎక్కువగా జరుగుతాయి. భారీగా పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ తరుణంలోనే అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతుండడం ఉపశమనం కలిగించే విషయం. మరోవైపు జూన్ లోనే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో పిల్లల చదువుకు భారీగా పెట్టుబడులు అవసరం. అందుకే ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ అవుతుండడం మాత్రం ఉపశమనం కలిగించే విషయం. మొత్తానికి అయితే రెండు పథకాలను సరైన సమయంలో అమలు చేసి ప్రజల కళ్ళల్లో ఆనందం నింపేలా కూటమి ప్రభుత్వం చూస్తోంది.