AP CM Chandrababu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ క్రమంగా కనుమరుగైంది. పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రతిపక్షం అనేదే ఉండకుండా చేసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీతోపాటు కమ్యూనిస్టులను కనుమరుగు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, కమ్యూనిస్టు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)లో విలీనం చేసుకున్నారు. తర్వాత 2018 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉనికే లేకుండా చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ మళ్లీ పోటీ చేసింది. కానీ ప్రభావం చూపలేదు. అదే సమయంలో 2019లో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో టీడీపీ తెలంగాణతో దాదాపు కనుమరుగైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా గులాబీ గూటికి చేశారు. వేళ్లపై లెక్క బెట్టేంత మందే ప్రస్తుతం పార్టీలో మిగిలారు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో టీటీడీపీ నేతలు కూడా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో.. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు.
త్వరలో కొత్త అధ్యక్షుడు..
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి అధ్యక్షులు అచ్చిరావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు అప్పగించగానే.. కొన్ని రోజులు పనిచేసి తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు టీడీపీ అధ్యక్షులయ్యాక పార్టీని వీడారు. ప్రస్తుతం ఏపీలో పార్టీ పుంజుకున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటం.. వచ్చే స్థానిక సంస్థల్లో పోటీ చేయటం, రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు అంశాలపై.. దృష్టిపెట్టారు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో నేతలకు కీలక సూచనలు చేశారు.
బాబుకు ఘన స్వాగతం..
ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను వ్యక్తిగతంగా వెళ్లి కలవటం గమనార్హం. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఇదే అనువైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే.. శనివారం (ఆగస్టు 10న) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంపై నేతలకు సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో..
ఇదిలా ఉంటే.. త్వరలో రాష్ట్రంలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థులను నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. కొత్త అధ్యక్షున్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే.. టీటీడీపీ అధ్యక్షుడి బరిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్‌గౌడ్, బక్కని నరసింహులు, సామా భూపాల్‌రెడ్డి, నందమూరి సుహాసిని, కాట్రగడ్డ ప్రసూన ఉన్నట్లు తెలుస్తోంది.
కోడలికే ఛాన్స్?
ఇదిలా ఉంటే తెలంగాణ పార్టీ పగ్గాలను తన కోడలికే ఇస్తారని సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాబు అరెస్టయిన సమయంలో ఏపీలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఆయన కోడలు నారా బ్రాహ్మణికే తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పజెబుతారని తెగ ప్రచారం జరిగింది. అయితే.. నిజానికి అధ్యక్ష బరిలో ఉన్నది.. బాబుకు కోడలి వరస అయ్యే నందమూరి సుహాసినికి పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.