Site icon OkTelugu

Social influencer Abbayi Kanth: నిండుగా చెత్త.. మెండుగా నిర్లక్ష్యం.. అతడి దృష్టిపడింది..ఆ పురాతన మెట్ల బావి ఇప్పుడు ఎలా ఉందంటే?

Social influencer Abbayi Kanth

Social influencer Abbayi Kanth

Social influencer Abbayi Kanth: అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అవి జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇతడు చేసిన పని కూడా అటువంటిదే. అతడికి అంగ అంగ బలం లేదు. అర్థ బలం అంతకంటే లేదు. పైగా సామాన్యుడు. తన వల్ల ఏమవుతుందను కోలేదు. తను మాత్రమే ఏం చేస్తానని భావించలేదు. ఒక్కడిగా అడుగు వేశాడు.. తనలాంటి అడుగులను జత చేశాడు. అంతేకాదు చూస్తుండగానే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత ఎవరు వస్తారని ఎదురు చూడక.. నీ వంతు పిడికిలి బిగించు.. అనే మాటను చేతుల్లో చూపించాడు.

అది పురాతన మెట్ల బావి.. దానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు గొప్పగా విలసిల్లిన ఆ బావి ఆ తర్వాత కాలక్రమంలో చెత్తతో నిండిపోయింది. మురుగునీటి కేంద్రంగా మారిపోయింది. ఘనమైన చరిత్రకు ఆలవాలంగా నిలిచిన ఆ పురాతన మెట్ల బావి చివరికి డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. ఆ బావి అలా ఉండడం కాంత్ అనే యువకుడికి నచ్చలేదు. పైగా ఘన వారసత్వం ఇలా మారిపోవడం అతడిని ఆలోచింపజేసింది. చెత్తతో నిండిపోయిన ఆ పురాతన బాగు చేసుకుందామని.. పూర్వ వైభవం తీసుకొద్దామని కాంత్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు. బావి దీనత్వాన్ని సూచించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అతడు పెట్టిన పోస్ట్ చాలామందిని కదిలించింది. ఒక్కొక్కరుగా 300 మంది ముందుకు వచ్చారు. పూర్వ సంపద రక్షక సేన పేరుతో ఒక సంస్థగా ఏర్పడ్డారు. 300 మంది స్వచ్ఛంద సేవకులు పురాతన బావి ఉద్ధరణకు నడుము బిగించారు. చేతి తొడుగులు.. పనిముట్లు.. ఇతరత్రా యంత్రాలతో అక్కడికి వచ్చారు. అందరూ కలిసి బావిలో పేరుకుపోయిన చెత్తను బయటకు తీశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మొత్తంగా ఆ బావికి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా ఇప్పుడు ఆ బావి కొత్తగా కనిపిస్తోంది. మెట్ల నుంచి మొదలుపెడితే లోపల నీరు వరకు ప్రతిదీ కూడా స్వచ్ఛంగా దర్శనమిస్తోంది.

అన్నట్టు ఈ బావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీపులి మండలంలో ఉంది. ఈ బావిని పునరుద్ధరించడానికి చాలా రోజుల సమయం పట్టింది. అన్ని రోజులు కూడా వారంతా తీవ్రంగా పనిచేశారు. మండే ఎండను లెక్క చేయలేదు. ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు బావి పునరుద్ధరణలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం తోడ్పాటు లేకుండా.. దాతల సహకారం లేకుండానే ఇంతటి యజ్ఞాన్ని నిర్వహించడం గొప్పగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పని చేసిన కాంత్.. అతని బృందాన్ని అభినందిస్తున్నారు.

తొలి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. ఆ తర్వాత దాని జతగా పడే అడుగులు కొత్తదారిని చూపిస్తుంటాయి. సరికొత్త దిశగా ప్రయాణం సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ అడుగులు ఆగవు. ఎందుకంటే తొలి అడుగు బలంగా ఉన్నప్పుడు.. మిగతా అడుగులు అంతకంటే బలంగా ఉంటాయి. దానిని నిరూపించాడు కాంత్.

Exit mobile version