AP Cabinet : ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం 10 నెలల పాలన పూర్తి చేసింది. 11వ నెలలో అడుగు పెట్టింది. ప్రస్తుతం పాలనపై పట్టు సాధించింది. ఈ నెల నుంచి కీలక సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. మరోవైపు మిత్రపక్షాలకు సైతం రాజకీయంగా అవకాశం కల్పించి మరింత పట్టు సాధించాలని చూస్తోంది. జనసేనతో పాటు బిజెపికి అవకాశాలు కల్పించి ఆ రెండు పార్టీలు తమకు వెన్నుదన్నుగా నిలవాలని టిడిపి భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందిస్తోంది. తాజాగా మంత్రివర్గ విస్తరణలో జనసేనకు ఒక మంత్రి పదవి ఇవ్వనుంది. అదే సమయంలో బిజెపికి సైతం చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చింది. తాజాగా నాగబాబుకు అవకాశం ఇవ్వడం ద్వారా నాలుగో మంత్రి పదవి ఇవ్వనుంది. అదే సమయంలో బిజెపికి సైతం మరో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
* నాగబాబు కు బెర్త్ ఖాయం..
ఏపీ సీఎం గా చంద్రబాబు( CM Chandrababu) ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ కు కల్పించారు. మరోవైపు క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు తాజాగా నాగబాబుకు పదవి ఇవ్వడం ద్వారా ఆ స్థానం భర్తీ కానుంది. అయితే ఇదే సమయంలో బిజెపి నుంచి సైతం ఒక మంత్రి పదవి డిమాండ్ వచ్చింది. అందుకే బిజెపికి స్థానం కల్పించేందుకు, నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు విస్తరణ ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు. నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వడమే తరువాయిగా ఉంది. మరోవైపు బిజెపి సైతం మంత్రి పదవి కోరుకుంటుంది.దీంతో మంత్రివర్గ కూర్పు జఠిలంగా మారింది.
* కూటమి ఏకపక్ష విజయం
2024 జూన్ లో టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చింది. 164 అసెంబ్లీ స్థానాలతో కూటమి అధికారంలోకి రాగలిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయింది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. మంత్రివర్గంలో సైతం మూడు పార్టీలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం కలిగింది. బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. తెలుగుదేశం పార్టీ 20 మంది మంత్రి పదవులు దక్కించుకున్నారు. క్యాబినెట్ లో ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అదే పదవిని నాగబాబు ద్వారా భర్తీ చేయనున్నారు. మరోవైపు టిడిపికి చెందిన ముగ్గురు మంత్రులు పదవులు వదులుకుంటారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా కోస్తా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముగ్గురు మంత్రి పదవుల నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది.
* సీనియర్లకు మొండి చేయి..
అయితే ఈసారి మంత్రివర్గంలో( cabinet ) చాలామంది సీనియర్లకు అవకాశం చిక్కలేదు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పదిమంది వరకు క్యాబినెట్లో చోటు ఇచ్చారు. అయితే టిడిపికి చెందిన ఓ ముగ్గురు మంత్రులపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత మంత్రులకు ముందుగానే చెప్పుకొచ్చారని.. ఏడాదిలో పనితీరు బాగానే ఉంటే కొనసాగిస్తామని హామీ ఇచ్చారని.. ప్రస్తుతం వారి పరిస్థితి బాగా లేకపోవడంతో మార్చే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇటువంటి సాహస నిర్ణయం.. తీసుకుంటారో? లేదో? చూడాలి.