AP Cabinet: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల శాఖలు ఖరారు అయ్యాయి. ఇక పాలన ప్రారంభించడమే తరువాయి అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల మేరకు కీలక ఐదు పైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైళ్ళపై చంద్రబాబు సంతకం చేశారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో కీలకమైనవిగా భావిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలన్నది ప్రజల అభిమతం. కేవలం సంక్షేమం మాత్రమే అమలు చేసిన జగన్ ను ప్రజలు తిరస్కరించారు. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి, ఆపై ఉద్యోగ, ఉపాధి కల్పన అవసరం. ఆ రెండింటిని అధిగమించాలంటే ఆర్థిక అవసరాలు చాలా కీలకం. అందుకే ఇద్దరు సీనియర్లకు ఆ బాధ్యత అప్పగించారు చంద్రబాబు. ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖను పొంగూరు నారాయణకు కేటాయించారు. ఐదేళ్లపాటు సుస్థిర పాలన అందించాలంటే.. ఆర్థిక మద్దతు అవసరం. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండడంతో రాయితీలు, రుణాలు సాధించడం కీలకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థిక గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారు కేశవ్. అటువంటిది అధికారంలోకి వచ్చి ఆర్థిక శాఖ ఆయన వద్ద ఉండటంతో.. ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు అన్నది చూడాలి.
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. నాడు పట్టణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణకు అమరావతి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఆయన అమరావతి విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు, పనులు శరవేగంగా జరపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నారాయణపై ఆ నమ్మకంతోనే మరోసారి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించారు చంద్రబాబు. మిగతా22 మందికి.. ఎవరికి స్థాయికి తగ్గట్టు వారికి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం గట్టెక్కాలంటే మాత్రం.. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్, అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలను చూసే మంత్రిగా నారాయణ యాక్టివ్ గా పని చేయాల్సి ఉంటుంది.