AP Assembly Election Results 2024: లెక్కింపునకు ముందు ఏపీలో కీలక రాజకీయ ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై వేటు పడింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు డెసిషన్ తీసుకున్నారు . రఘురాజు పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోషేన్ రాజు తెలిపారు. ఈ మేరకు శాసనమండలి కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు ఇందుకూరి రఘురాజును అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈయన 2021 లో విజయనగరం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాల వ్యవధి లోనే ఆయన పదవి కోల్పోయారు.
ఇందుకూరి రఘురాజు బొత్స సత్యనారాయణ ప్రధాన అనుచరుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. కొద్దిరోజుల పాటు బిజెపిలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బొత్స పిలుపుమేరకు వైసీపీలో చేరారు. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆశించారు. కానీ రఘురాజుకు కాకుండా జగన్ కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆయన విజయానికి కృషి చేశారు. అందుకే 2021 లో జరిగిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘురాజుకు చాన్స్ ఇచ్చారు. అయితే ఈసారి వైసీపీ తరఫున పోటీ చేయాలని రఘు రాజు భావించారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు. దీనిపై అసంతృప్తికి గురైన రఘురాజు సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు.
ఎన్నికలకు ముందు రఘురాజు భార్య. ఎస్ కోట మండల ఉపాధ్యక్షురాలు ఇందుకూరి సుధారాణి టిడిపిలో చేరారు. ఆమెతోపాటు ఎంపీపీలు, జడ్పిటిసిలు, 15 మంది సర్పంచులు, మరో 15 మంది ఎంపీటీసీలు టిడిపిలో చేరిపోయారు. వారందరికీ నారా లోకేష్ స్వాగతం పలికారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే ఇదంతా రఘురాజు ప్రోత్సాహంతో జరిగిందని వైసీపీ అనుమానించింది. ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనని.. తాను వెళ్లకుండా, భార్య సుధారాణిని పంపించారని వైసీపీ నాయకత్వం భావించింది. ఈ పరిణామాల క్రమంలో పార్టీ ధిక్కారానికి పాల్పడ్డారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని మండలి విప్ పాలవలస విక్రాంత్ చైర్మన్ కు దరఖాస్తు చేశారు. అయితే కౌంటింగ్ కు ముందు రోజే అనర్హత వేటు వేయడం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారింది.