AP Assembly Election Results 2024: ఎన్నికల్లో చాలా రకాల సెంటిమెంట్స్ పనిచేస్తాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందిన వారే రాష్ట్రంలో అధికారాన్ని చేపడతారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి ఒక సెంటిమెంట్ ఉంది. వాణిజ్య రాజకీయ రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అక్కడ ఏ పార్టీ గెలుపొందితే.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంప్రదాయం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.
భీమవరం నియోజకవర్గంలో 2.51 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కాపు సామాజిక వర్గం వారే అధికం. జిల్లా రాజకీయాలను శాసిస్తోంది కూడా ఈ నియోజకవర్గమే. ఈసారి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో భీమవరానికి ఎనలేని గుర్తింపు లభించింది. ఎన్నికల్లో సైతం ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ పవన్ పిఠాపురానికి షిఫ్ట్ అయ్యారు. టిడిపిలో ఉన్న పులపర్తి రామాంజనేయులను జనసేనలోకి రప్పించి టిక్కెట్ ఇచ్చారు.
అయితే ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అందుకే ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. సెంటిమెంటును అనుకూలంగా మలుచుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నం చేశాయి. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి రామాంజనేయులు పై సానుభూతి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రామాంజనేయులు కు 52,000 ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీలో వైసిపి అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రామాంజనేయులు బరిలో దిగడంతో విజయం పై ధీమాతో ఉన్నారు. ఇక్కడ గెలిచి రాష్ట్రస్థాయిలో గెలవాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.