AP Rain Alert : ఏపీకి మరో షాక్. కొద్ది రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వరదలతో జనాలు అవస్థలు పడుతున్నారు. నష్ట నివారణకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. విజయవాడ కలెక్టరేట్లో బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేశారు. వరదల దృష్ట్యా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా విజయవాడ నగరంపై వరద తీవ్రత ప్రభావం అధికంగా ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. విజయవాడ శివారు ప్రాంతాలు ఇంకా వరద బారిన ఉన్నాయి. అక్కడ బాధితులు ఇళ్లకే పరిమితం అయ్యారు. అక్కడ సహాయ చర్యలు సైతం కొనసాగుతున్నాయి.
* వర్షాలు తగ్గుముఖం
గత రెండు రోజులుగా వర్షాలతో పోల్చితే.. క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణ పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో తుఫాన్ రాబోతుందని.. ఏపీకి భారీ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అది తుపానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
* అల్పపీడనం బలపడి
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతం వాయువ్యదిశగా కదులుతోంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రాంతాలను ఆనుకుని కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందన్నారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్లఅతి భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది.దీంతో ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.
* ఈరోజు భారీ వర్షాలు
ఈరోజు పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన ఉన్నాయి. అక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మరో నాలుగు రోజుల్లో మరో అల్పపీడనం ప్రభావం ఉంటుందని తెలియడంతో ఏపీ ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు ముందస్తు చర్యలకు సీఎం చంద్రబాబు సైతం ఆదేశించినట్లు సమాచారం.