Prakasam Barrage  : ప్రమాదంలో ప్రకాశం బ్యారేజీ.. విరిగిన గేట్లు.. ఏ క్షణమైనా కొట్టుకుపోవచ్చు

భారీ వర్షాలతో ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రకాశం బ్యారేజీ పై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : September 2, 2024 11:14 am

Prakasam Barrage

Follow us on

Prakasam Barrage : ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణకు సైతం భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండడంతో.. నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. విజయవాడ శివారు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడానికి కూడా కారణం ఇదే. మరోవైపు ప్రకాశం బ్యారేజీ లోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గడచిన 50 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అటు ప్రకాశం బ్యారేజీ సైతం ప్రమాదకర స్థితిలో కనిపిస్తోంది. ఆదివారం ఉదయం ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో.. రాత్రి 7 గంటల సమయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను ఎత్తి కిందకు విడిచి పెడుతున్నారు. బ్యారేజీ కి సంబంధించి కాలువల్లో నీటిని విడిచిపెట్టడం లేదు. గేట్లను మూసివేశారు. పొలాల్లో వరద ముంపు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్యారేజీ కిందకు మీరు రికార్డ్ స్థాయిలో వెళ్తోంది.

* సోషల్ మీడియాలో ప్రచారం
సరిగ్గా ఇటువంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్లలో.. తొలి మూడు గేట్లు కొట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్త హల్చల్ చేస్తోంది. అందుకు సంబంధించి వీడియో దర్శనమిస్తోంది. అయితే ఇది వైసీపీ ప్రచారం అని తెలుస్తోంది. దీంతో విజయవాడ నగరవాసుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మొన్నటికి మొన్న తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాని ప్రకాశం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోతే.. ఖరీఫ్ నకు తీవ్రగండం. కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండడంతో తాత్కాలికంగా గేట్లు వేయడం కూడా చాలా కష్టతరం.

* ఒట్టిదేనంటున్న అధికారులు
అయితే ఈ తరహా ప్రచారం ఒట్టిదేనని ప్రకాశం బ్యారేజీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతోందని.. అంతలోనే విమర్శలు మొదలుపెట్టేశారని.. వారి వైఫల్యాలను టిడిపి కూటమి ప్రభుత్వంపై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మూడు పార్టీల శ్రేణులు మండిపడుతున్నారు. అది తప్పుడు ప్రచారంగా చెప్పుకొస్తున్నారు.

* రికార్డ్ స్థాయిలో వరద
అయితే ప్రకాశం బ్యారేజీలోకి ఇంత భారీ స్థాయిలో వరద నీరు రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి 9.30 లక్షల క్యూసెక్కుల వరకు నీరు విడుదల అయ్యే అవకాశం ఉంది. అందుకే అధికారులు ముందస్తుగా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒకవేళ తెలంగాణలో వర్షాలు ముదిరితే మాత్రం.. నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర చేయి దాటుతుంది. అంతిమంగా అది విజయవాడ నగరానికి నష్టం కలిగిస్తుంది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. వరద నీరు తగ్గుతుందని భావిస్తున్నారు.