Homeఆంధ్రప్రదేశ్‌Lavu Sri Krishna Devarayalu: వైసీపీకి మరో ఎంపీ షాక్!

Lavu Sri Krishna Devarayalu: వైసీపీకి మరో ఎంపీ షాక్!

Lavu Sri Krishna Devarayalu: వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటించారు. ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. నరసరావుపేట టిక్కెట్ విషయంలో హై కమాండ్ చర్యలతో విసిగి వేశారిపోయిన ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కోస్తాంధ్రలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపొందారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి బాగానే కృషి చేస్తున్నారు. నేరుగా ఢిల్లీ పెద్దలతో పరిచయాలు ఏర్పరచుకొని ఎంపీ ల్యాడ్ నిధులు తీసుకొస్తున్నారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయింపులు చేస్తున్నారు. కీలక సమస్యలకు పరిష్కార మార్గం చూపారని కూడా ఎంపీ లావుకు పేరు ఉంది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి పక్కన పెడతారని ప్రచారం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ సూచిస్తున్నారని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణదేవరాయలే ప్రకటించారు. అయితే గుంటూరు ఎంపీ సీటు ఇస్తామని చెప్పి యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలోకి రప్పించారు. పార్టీలో చేరిన తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని.. తనకు ఇష్టం లేదని చెప్పడంతో.. అంబటి రాయుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పార్టీకి వెనువెంటనే గుడ్ బై చెప్పారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానంలో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించుతారని ప్రచారం జరుగుతోంది. అందుకే లావు కృష్ణదేవరాయలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ హైకమాండ్ పై ఆగ్రహంతో ఉన్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలతో ఈయనకు పొసగడం లేదు. చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన మంత్రి విడుదల రజిని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తో లావు శ్రీకృష్ణదేవరాయలకు సఖ్యత లేదు. తన నియోజకవర్గంలో పర్యటించాలంటే తన అనుమతి తప్పనిసరి అని మంత్రి రజిని కండిషన్ పెట్టారు. అటు అంబటి రాంబాబు సైతం ఈ విధంగానే నిబంధనలు పెట్టారు. దీంతో మనస్థాపం తో లావు శ్రీకృష్ణదేవరాయలు గడిపేవారు. హై కమాండ్ సైతం తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే పార్టీలో ఉండడం దండగ అన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. గత 15 రోజులుగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నానని.. అనుచరులు, అభిమానులతో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version