Chandrababu On PK: మొన్న ఆ మధ్యన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారు. చాలా గంటలసేపు చర్చలు జరిపారు. దీంతో టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని ప్రచారం ప్రారంభమైంది. లోకేష్ తో పాటు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఒక్కసారిగా చంద్రబాబు వద్ద కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. టిడిపి కోసం పనిచేసేందుకు పీకే ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ పూర్తి సమయం కేటాయించేందుకు కాదని.. ఎన్నికల వరకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారని టాక్ నడిచింది.
గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. నేరుగా పార్టీ సమావేశంలోనే పీకే ను నేతలకు పరిచయం చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేస్తుందని ప్రకటించారు. అప్పటినుంచి పీకే టీం ఏపీలో తన సేవలను ప్రారంభించింది. రాజకీయ సమీకరణలను వైసీపీకి అనుకూలంగా మార్చింది. గత ఎన్నికల్లో జగన్ అద్భుత విజయానికి పీకే సేవలు కూడా ఒక కారణమన్న విశ్లేషణ ఉంది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహకర్త పదవిని ప్రశాంత్ కిషోర్ విడిచిపెట్టారు. బీహార్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. కానీ పీకే ఐపాక్ మాత్రం జగన్ కోసం పనిచేస్తోంది. దానికి రుషిరాజ్ సింగ్ సారధిగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ టీం పని చేస్తోంది. రాబిన్ శర్మ పూర్వాశ్రమంలో ఐపాక్ టీం సభ్యుడే. ప్రశాంత్ కిషోర్ సమకాలీకుడు. గత నాలుగు సంవత్సరాలుగా టిడిపికి సేవలందిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు తన వద్దకు తెప్పించుకున్నారు. కీలక చర్చలు జరిపారు. అప్పటినుంచి పీకే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉంటారని ప్రచారం ప్రారంభమైంది. అయితే దానిపై తెలుగుదేశం పార్టీ కానీ.. ప్రశాంత్ కిషోర్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ స్పష్టతనిచ్చారు. చంద్రబాబు టిడిపి తరుపున రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని కోరారని.. కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. తాను బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని.. ఇప్పటికే వైసీపీకి సేవలు అందించానని.. సలహాలు,సూచనలు మాత్రమే అందించగలనని చంద్రబాబుకు చెప్పినట్లు స్పష్టతనిచ్చారు. అయితే వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారని.. అంతకుమించి ఏమీ లేదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వద్దకు ప్రశాంత్ కిషోర్ వెళ్లారని మరో టాక్ నడుస్తోంది. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబుకు కానీ పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టతనిచ్చారు. గత కొద్దిరోజులుగా రేగుతున్న ఊహాగానాలకు తెరదించారు.