Chandrababu: చంద్రబాబు స్కెచ్ అదే

వాస్తవానికి ఈపాటికే జనసేనతో సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబు తేల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత డిసెంబర్ లో పవన్ తో పలుమార్లు చంద్రబాబు సమావేశం అయిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : January 23, 2024 1:22 pm

Chandrababu

Follow us on

Chandrababu: వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు పక్కా స్కెచ్ తో అడుగులేస్తున్నారు. జనసేనతో పొత్తు ద్వారా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అదే సమయంలో తమ వ్యూహాలు అధికార పార్టీకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. కానీ అంతకంటే ముందే వివాదాలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను సైతం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

వాస్తవానికి ఈపాటికే జనసేనతో సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబు తేల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత డిసెంబర్ లో పవన్ తో పలుమార్లు చంద్రబాబు సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు తోడు జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా నాలుగు పథకాలు జత చేసి.. ఉమ్మడి మేనిఫెస్టో కింద పది పథకాలను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుదామని ఒక నిర్ణయానికి వచ్చారు.

అయితే జనవరి ప్రారంభం నుంచి చంద్రబాబు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో ‘రా కదలిరా’ పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడే టిడిపి అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. కానీ మండపేట వంటి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి పేరు ప్రకటన చేయడం కలకలం రేగింది. దీనిపై జనసేన నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. జనసేన షణ్ముఖ వ్యూహం పథకాలు మాత్రం అలానే ఉండిపోయాయి. అయితే ఇది చంద్రబాబు వ్యూహమా? వ్యూహాత్మకమా? అన్నది తెలియడం లేదు. టిడిపి వెంట జనసేన కలిసి వస్తుందన్న కాన్సెప్ట్ తోనే చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

అటు పవన్ సైతం ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధపడుతున్నారు. ప్రతిరోజు మూడు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా కీలక నియోజకవర్గాల విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తన షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రకటించే పథకాల ప్రస్తావన తెచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే అటు చంద్రబాబు, ఇటు పవన్ వేర్వేరుగా చేసే ప్రకటనల వెనుక ఒక వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. అధికార వైసిపికి అంతు చిక్కకుండా ఉండేందుకే ఈ విధంగా ఎవరికి వారుగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం ఇరు పార్టీల అభ్యర్థుల ప్రకటనను చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే పొత్తులో సింహభాగం ప్రయోజనం పొందాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే టిడిపితో జనసేన కలిసి వస్తుందని నమ్మకాన్ని కలిగించాలని చూస్తున్నారు. టిడిపి, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న మాటను నియంత్రించడానికి చంద్రబాబు ఇలా సరికొత్త స్కెచ్ వేస్తున్నారని.. పవన్ ను సైతం తన అదుపులో పెట్టుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అటు జనసేనను నియంత్రించే విషయం, ఇటు అధికార వైసీపీని ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు ఆలోచన వర్కౌట్ అవుతుందో? లేదో? చూడాలి.