Visakhapatnam development: ఏపీకి( Andhra Pradesh) మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో పాటు టిసిఎస్, కాగ్నిజం ట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి. మరో 10 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పించనున్న ఈ సంస్థలు. అందుకే ఐటీ పరిశ్రమలకు సంబంధించి వాణిజ్య భవనాలు, ఉద్యోగుల నివాస భవనాల రహేజా కార్పొరేషన్ ఆసక్తి చూపింది. రూ.2100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇది శుభ పరిణామం.
భూమి కేటాయింపునకు విజ్ఞప్తి..
విశాఖ మధురవాడ( Madhurawada ) ఐటి హిల్ నెంబర్ 3 లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రహేజా తన ప్రతిపాదనలో తెలిపింది. సాధారణంగా ఐటీ సంస్థలకు భవనాలు అవసరం. ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. అయితే ఐటీ సంస్థలు టవర్లు నిర్మిస్తుంటాయి. ప్రస్తుతం మిలీనియం టవర్ ఒకటి, రెండు లో ఉన్న సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని టిసిఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలకు కేటాయించారు. కొత్తగా వచ్చే కంపెనీల కోసం రహేజా సంస్థ రెండు దశల్లో దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. కార్యాలయ స్థలాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు..
రహేజా సంస్థ( Raheja company) తన ప్రతిపాదనలో భాగంగా.. కీలక సూచనలు చేసింది. 2028 నాటికి వాణిజ్య భవనాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పనులకు రూ.663.42 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. మిగతా మొత్తాన్ని నివాస భవనాల నిర్మాణానికి ఖర్చు చేయాలని భావిస్తోంది. రెండు దశల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టనుందన్నమాట. అయితే ఇది నిర్మాణ రంగ పెట్టుబడి. ఐటి ఆధారిత పరిశ్రమలకు ఇది ఊతం ఇచ్చినట్టు అవుతుంది.