Dhanteras 2025: హిందువుల పండుగలలో దీపావళి కూడా ముఖ్యమైనదే. ప్రతి ఏడాది అశ్వయుజ మాస అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో అక్టోబర్ 20న దీపావళి పండుగ రాబోతుంది. అయితే దీపావళికి రెండు రోజుల ముందు ధన త్రయోదశి వేడుకలు నిర్వహించుకుంటారు. అశ్వయుజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశి తిథి న ఈ పర్వదినం రాబోతుంది. ధన అంటే సంపద.. త్రయోదశి అంటే తిథి పేరు.. అంటే ఈరోజు లక్ష్మీదేవికి అనుకూలమైన వస్తువులు కొనుగోలు చేస్తే సంపద వస్తుందని నమ్ముతారు. అయితే ధన త్రయోదశి రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? ఏమి కొనుగోలు చేయొద్దు?
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు అని భక్తులు చెబుతారు. అందుకే ఈరోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. బంగారం అంటే లక్ష్మికి ప్రతిరూపం. అందువల్ల ఈరోజు పిసిరంతా అయినా బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాగే ఈరోజు తామర పువ్వు లేదా గింజలు కొనుగోలు చేయాలని పండితులు చెబుతున్నారు. కొత్త పాత్రలు అంటే స్టీల్, ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ధన్వంతరి ఫోటో లేదా చిత్రపటం కొరుగోలు చేసిన శుభమే అంటున్నారు. ఈరోజు దుస్తులు కొరుగోలు చేయవచ్చని, పర్సు లేదా బిజినెస్ కు సంబంధించిన పుస్తకం కూడా కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అలాగే కొత్త కరెన్సీ నోట్లు ధనియాలు కొనుగోలు చేయాలంటున్నారు.
అయితే ఈరోజు కొన్ని వస్తువులను చేయవద్దని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ధన త్రయోదశి శనివారం రాబోతుంది. అందువల్ల శనికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు. అంటే ఇనుప వస్తువులు.. అనగా బ్లేడు, సూది వంటి ఇనుముకు సంబంధించిన ఏ వస్తువులు కొనుగోలు చేయరాదు. అలాగే నల్ల దుస్తులు ఈరోజు కొనుగోలు చేయరాదు. బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, బొగ్గు వంటివి కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఈరోజు ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు.
ధన త్రయోదశి రోజు పై వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడమే కాకుండా సాయంత్రం పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రదోష కాలంలో లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవుడికి దీపం ఉంచడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుందని అంటారు. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఓం శ్రీ ధన్వంతరయ నమః అనే మంత్రం జపించాలి. కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేస్తే వాటిని పూజ గదిలో ఉంచి ప్రార్థించాలి. అలాగే ఈరోజు బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తే వాటిని పూజ గదిలో ఉంచి ప్రత్యేకంగా పూజలు చేయాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు.