Annadata Sukhi Bhava : ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టింది. అందులో కీలకమైన రెండు పథకాలను అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన పథకాలకు మోక్షం కల్పించాలని భావిస్తోంది. ఇటీవల వార్షిక బడ్జెట్లో రెండు ప్రధాన పథకాలకు నిధులు కేటాయించింది. ఇప్పుడు తాజాగా కలెక్టర్ల సదస్సులో ఈ పథకాలపై క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. కేంద్రం మాదిరిగానే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!
* అప్పట్లో రైతు భరోసా పేరిట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరిట సాగుకు ప్రోత్సాహక నిధి అందేది. అప్పట్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతుకు 15000 రూపాయల చొప్పున సాగు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అందులో సగం మొత్తం మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ 6000 రూపాయలకు తోడు.. మరో 7500 రూపాయలు అందించగలిగారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20వేల రూపాయల చొప్పున సాగు ప్రోత్సాహం నిధి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఖరీఫ్ ప్రారంభంలోనే అందించేందుకు సిద్ధపడుతున్నారు.
* కలెక్టర్ల సదస్సులో..
తాజాగా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు( CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ మాదిరిగానే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ అందించడానికి నిర్ణయించారు. కేంద్రం రూ.2000 చొప్పున మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం మాదిరిగానే మూడు విడతల్లో మిగతా 14 వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రెండుసార్లు 5000 చొప్పున, చివరిగా నాలుగువేల చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. జూన్లో ఖరీఫ్ పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా మే నెలలో తొలి విడత నగదు అందించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
* కౌలు రైతులకు సైతం..
మరోవైపు కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సంబంధిత వ్యవసాయ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. దీంతో కౌలు రైతులకు సైతం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయితే కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ కౌలు రైతులకు అందడం లేదు. అందుకే అన్నదాత సుఖీభవ అందించడానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అయితే చట్టం తెచ్చి అయినా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రానున్నాయి.
Also Read : ఆస్తిపన్ను బకాయిదారులకు ఇదో సువర్ణావకాశం.. త్వరపడండి