Thalliki Vandanam
Thalliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టింది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్న అందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభం కాలేదు. అయితే మొన్నటికి మొన్న వార్షిక బడ్జెట్లో పథకాలకు సంబంధించి కేటాయింపులు చేశారు. దీంతో కొంతవరకు ప్రజల్లో నమ్మకం వచ్చింది. అయితే ఈరోజు చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో రెండు పథకాలకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని వెల్లడించారు.
Also Read: ఏపీ బీజేపీకి పదవి.. ఆ ముగ్గురిలో ఎవరికి?
* నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి
2019లో నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువు ప్రోత్సాహం కింద నగదు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి విద్యార్థి చదువుకు 15 వేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే సాయం అందించడానికి ముందుకు వచ్చారు. తొలి ఏడాది పూర్తిస్థాయిలో 15 వేల రూపాయలు అందించారు. అటు తర్వాత ఆ మొత్తంలో కూడా కోత విధించారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రధాన హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
* తొలి విద్యా సంవత్సరం నిల్
గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం( Alliance government) అధికారంలోకి వచ్చింది. అప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కనీసం తల్లికి వందనంపై చర్చ కూడా జరపలేదు. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం.. ప్రజలు ఎదురుచూస్తుండడంతో గుర్తించిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమలు చేయడానికి డిసైడ్ అయింది. కొద్ది రోజుల కిందట శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశారు. ఇప్పుడు అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అమరావతి వేదికగా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు.
* ఇంట్లో ఎంతమందికైనా..
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం( thallikki Vandanam ) పేరిట చదువుకు సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ పథకం విషయంలో ఎటువంటి రాజీలేదని.. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరిట సాయం చేస్తామన్నారు. మే నెలలోనే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసి.. తరువాతనే పాఠశాలలను తెరుస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం.