Anil Kumar Yadav : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఉన్నట్టుండి ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు నెల్లూరు నేతలపై విమర్శలు కురిపించారు. దీంతో తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్లు సంకేతాలు ఇచ్చారు. అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ అధినేతను కలవడం, వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : ఏపీకి ప్రధాని.. ఢిల్లీ వెళ్లిన రెండో రోజే సంచలన నిర్ణయం!
* అధినేత ఎనలేని ప్రాధాన్యం..
నెల్లూరు సిటీ ( Nellore City) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ క్యాబినెట్లో మూడేళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి పై ఎనలేని అభిమానం చూపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుంచి కనిపించకుండా మానేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీలో యాక్టివ్ కావడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది.
* అనిల్ తీరుతోనే నేతలు గుడ్ బై..
అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) తీరు నచ్చక వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు టిడిపిలో చేరిపోయారు. పార్టీకి మూల స్తంభంగా ఉన్న తనలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో వేంరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాట చెల్లుబాటు అవుతుండడంతో తాను పార్టీలో ఉండలేనని బయటకు వచ్చారు. అయితే ఎప్పటికైనా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనసు మార్చుకుంటారని.. నెల్లూరు జిల్లాలో ఒక ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై విమర్శలకు దిగారు. వేంరెడ్డి తీరుతోనే నెల్లూరు జిల్లాలో మైనింగ్ ఆగిపోయిందని.. పదివేల మంది వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. పేదల ఉసురు పోసుకోవద్దని వేంరెడ్డి పై విరుచుకుపడ్డారు.
* సరైన నియోజకవర్గం లేక..
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కు నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. ఓడిపోయిన తర్వాత ఆయన నరసరావుపేట( narasaraopeta ) పార్లమెంట్ స్థానం వైపు చూడడం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలను వేరొకరికి అప్పగించారు. అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో పాటు బంధువులు టిడిపిలో చేరిపోయారు. గత కొద్ది నెలలుగా ఇతర రాష్ట్రాల్లో అనిల్ కుమార్ యాదవ్ వ్యాపారాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా పార్టీలో యాక్టివ్ కావడం.. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై విమర్శలు చేస్తుండడం చూస్తుంటే.. అనిల్ అభద్రతాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..