PM Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) మరోసారి ఏపీకి రానున్నారు. ఆయన పర్యటన ఖరారు అయ్యింది. కొద్ది రోజుల కిందటే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సంగతి తెలిసిందే. అశేష జన వాహిని నడుమ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు నరేంద్ర మోడీ. అప్పుడే తాను మరోసారి ఏపీకి రానున్నానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం సైతం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. విశాఖపట్నం కలెక్టర్ కు కూడా లేఖ రాశారు. ప్రధాని వస్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. మారిన రాజకీయ వైఖరితోనే ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’.. టైటిల్ అదుర్స్!
* మాట ఇచ్చినట్టే ప్రధాని..
ప్రపంచ యోగా దినోత్సవం( world yoga event) జూన్ 21న జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు యోగాపై ప్రత్యేక దృష్టితో ఉంటారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి.. యోగా దినోత్సవం జరిపి.. మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చ జరగాలని భావించారు. అందుకే ఏపీలో జరిగే యోగా దినోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ప్రధాని వస్తానని చెప్పారు. మాట ఇచ్చినట్టే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావడం, విశాఖ కలెక్టర్ కు లేఖ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* అనేక సందేహాల నడుమ..
యోగాకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం( central government) దీనిని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాకపై సందేహాలు ఉండేవి. అయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం చేసిన ప్రధాని.. ఢిల్లీ వెళ్లిన రెండో రోజే.. ఏపీలో జరిగే యోగా దినోత్సవానికి వస్తున్నట్లు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ప్రధాని విశాఖను ఎంచుకోవడం మాత్రం గమనార్హం. వాస్తవానికి సీఎం చంద్రబాబు అమరావతిలో యోగ దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు. తద్వారా అమరావతి పేరును మరోసారి జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చూడాలని భావించారు. అయితే ప్రధాని మాత్రం విశాఖను ఎంచుకున్నారు. దీంతో అక్కడే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
* ఏయూ శత దినోత్సవాలు..
వాస్తవానికి విశాఖ లోని ఆంధ్ర యూనివర్సిటీ( Andhra University) శత దినోత్సవాలను జరుపుకుంటుంది. మొన్ననే దీనికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు జరగనున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనను ఆంధ్ర యూనివర్సిటీ శతజయంతి వేడుకలకు సైతం వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్రం తరఫున యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా రెండు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ విషయంలో ఆసక్తి చూపుతుండడంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.