AP Assembly Sessions 2026: ఏపీ( Andhra Pradesh) అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభకు హాజరుకామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికీ అదే స్టాండ్ తో ఉంది. మరోవైపు వరుసగా పని దినాలు కలుపుకొని శాసనసభకు 60 రోజులపాటు హాజరు కాకుంటే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చించారు. ప్రభుత్వానికి నివేదించనున్నారు. స్పీకర్ ద్వారా మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ నుంచి జనవరి మధ్య జరగాలి. కానీ ఈసారి ఆలస్యం జరిగింది. ఫిబ్రవరిలో సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు పది రోజులపాటు సభను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం.
* ప్రజలకు వాస్తవాలు తెలిసేలా..
అయితే ఈసారి కూటమి ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో( sessions ) వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి సమగ్రంగా వివరించనున్నారు ఈ సభ ద్వారా. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, విశాఖలో పరిశ్రమల ఏర్పాటు, ఏపీకి భారీగా వస్తున్న ప్రాజెక్టులు, తయారీ రంగం పరిశ్రమలు.. ఇలా ప్రతి అంశం గురించి సమగ్రంగా చర్చించే వీలుగా సభలు ఉండనున్నాయి. అర్థవంతమైన చర్చకు తెర లేపనున్నారు. ముఖ్యంగా విపక్ష పాత్రను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోషించనున్నారు. ప్రజల తరఫున బలమైన వాయిస్ వినిపించి ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టనున్నారు. అందుకే లోతైన అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. మంత్రులు కూడా సమగ్ర వివరాలతో సభకు హాజరుకావాలని ఇప్పటికే సంకేతాలు పంపించారు.
* అన్ని వివరాలు స్పష్టంగా..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్( PowerPoint presentation ) ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థాయిలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల్లో.. 25% ఏపీకి రావడం నిజంగా శుభపరిణామం. ఇందులో సగం పెట్టుబడులు వచ్చిన ఏపీ అభివృద్ధి సాధించినట్టే. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టే ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అడుగులు వేస్తోంది. అమరావతి రాజధానితోపాటు పోలవరం ప్రాజెక్ట్ వంటి ప్రాధాన్యతాంశాలను పూర్తిచేసేందుకు గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. మొన్ననే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అయితే వైసీపీ నుంచి మాత్రం అంతా తామే చేసాం అన్నట్టు వాయిస్ వస్తోంది. అందుకే దాదాపు పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. ప్రజలకు వాస్తవాలు తెలియజేపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది.