Anam Ramanarayana Reddy: ఆ మంత్రికి ప్రాణహాని.. అందరూ చూస్తుండగానే రెక్కీ

ఆ మంత్రితన ఇంట్లో నియోజకవర్గ అంతర్గత సమావేశం నిర్వహించారు.పార్టీ క్రియాశీలక నాయకులను ఆహ్వానించారు.అయితే స్వామి మాల ధారణలో ఉన్న ఓ నేత హల్చల్ చేశారు.తీరా ఆయన ప్రత్యర్థి పార్టీ నేత అని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Written By: Dharma, Updated On : October 23, 2024 2:19 pm

Anam Ramanarayana Reddy

Follow us on

Anam Ramanarayana Reddy: ఏపీ రాజకీయాల్లో ఆనం రామనారాయణ రెడ్డి ది ప్రత్యేక స్థానం.ఉమ్మడి ఏపీలోనే తనకంటూ ఒక రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రామ నారాయణ రెడ్డి.వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఆప్తుడు. సమకాలీకుడు కూడా.2004, 2009 రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రామ నారాయణ రెడ్డి కీలక మంత్రి. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్లో చేరారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు కాంగ్రెస్ వాదిగానే ఉండేవారు. అనూహ్యంగా మళ్ళీ టిడిపిలో చేరారు. అయితే జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు.కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. పార్టీలోకి పిలిచి జగన్ దారుణంగా అవమానించారు. ఆనం రామనారాయణ రెడ్డి కంటే జూనియర్లు అయినా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలకు మంత్రి పదవిని ఇచ్చి ప్రోత్సహించారు. వారితోనే ఆనం రామనారాయణ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయించారు. దీనిని జీర్ణించుకోలేని రామనారాయణరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే గానే ఉంటూ అసంతృప్తి స్వరం వినిపించారు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డి సీనియారిటీని గౌరవించి మంత్రిని చేశారు. క్యాబినెట్ లోకి తీసుకొని దేవాదాయ శాఖను అప్పగించారు. అయితే నెల్లూరులో వైసీపీ పట్టణానికి ప్రధాన కారణం ఆనం రామనారాయణ రెడ్డి అని వైసిపి శ్రేణుల్లో ఆగ్రహం ఉంది. ఈ తరుణంలోనే ఏకంగా టిడిపి సమావేశంలో అనూహ్య ఘటన ఒకటి జరిగింది. స్వామి మాలలో ఉన్న వైసీపీ నేత సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీనిని గ్రహించిన టిడిపి శ్రేణులు ఆయనను చుట్టుముట్టాయి. పోలీసులకు అప్పగించాయి.

* మంత్రి సంచలన కామెంట్స్
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. లైసెన్స్ గన్ కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చర్చకు దారితీస్తున్నాయి. తన నివాసంలో జరిగిన అంతర్గత సమావేశానికి వైసీపీకి చెందిన వ్యక్తి రావడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో.. పరిసర ప్రాంతాల్లో రెక్కీ సైతం నిర్వహించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. అలా పట్టుబడిన వ్యక్తి మాటలు అనుమానంగా ఉన్నాయని.. గత ప్రభుత్వంలోనే తనకు భద్రతను తొలగించిన విషయాన్ని ఆనం గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తున్నాయి.

* వైసిపి పతనానికి ఆయనే కారణం
వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది.2014 ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది.2019 ఎన్నికల్లో వైట్ వాష్ చేసింది.అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది.తొలుత పార్టీని విభేదించారు ఆనం రామనారాయణరెడ్డి. ఆయనకు తోడయ్యారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తరువాత కాలంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇలా నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి ఆనం రామనారాయణరెడ్డి తీరు కారణమని ఆ పార్టీ వర్గాల్లో ఒక రకమైన ఆగ్రహం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వామి మాల ధారణలో ఓ వ్యక్తి ఆనం ఇంట్లో ప్రవేశించడం, అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీయడం.. వంటివి సంచలనం అవుతున్నాయి. స్వయంగా మంత్రి హోదాలో ఉన్న నేత తనకు ప్రాణ హాని ఉందని చెబుతుండడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అదే స్థాయిలో సంచలనం కూడా రేపుతోంది.