Margadarsi Chit Fund: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో మార్గదర్శికి చుక్కలు కనిపించాయి. చివరికి ఏపీ సీఐడీ ఏకంగా రామోజీరావు ఇంటి తలుపు తట్టింది. ఆయనను మంచంపై పడుకోబెట్టి విచారణ చేసింది. అంతేకాదు రామోజీరావును జైలుకు పంపించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోకాలడ్డారు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అప్పట్లో జగన్ ఒత్తిడి చేసినప్పటికీ కేసీఆర్ ఎందుకనో ఒప్పుకోలేదు..
ఇప్పుడు రెండో తెలుగు రాష్ట్రాల్లో మార్గదర్శికి అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో రేవంత్.. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు…ఇద్దరూ తనకు అనుకూలమైన వ్యక్తులు కావడంతో మారదర్శికి పెద్దగా ఇబ్బంది లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్గదర్శి కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అక్కడ చందాదారుల నుంచి మార్గదర్శి యాజమాన్యం చిట్స్ వసూలు చేస్తోంది. అయితే వదల బొమ్మాళీ అన్నట్టుగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రామోజీరావు కన్నుమూసినప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కోపం ఇంకా తగ్గనట్టుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ” డిపాజిట్ దారుల డీటెయిల్స్ న్యూస్ పేపర్లలో నోటీసుల తరహా అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ చేయాలి. దీనికి ఎంత మొత్తం వ్యయం అవుతుందో మార్గదర్శి యాజమాన్యానికి రిజిస్ట్రీ వెల్లడిస్తుంది. ఆరోజు నుంచి వారంలోగా ఆ డబ్బును వారి ఖాతాలో జమ చేయాలి. అన్ని పత్రికలలో విస్తృతంగా ఆ ప్రకటనలు ప్రచురితం కావాలని” ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 30 కి వాయిదా వేసింది. ఇదే సమయంలో మార్గదర్శి యాజమాన్యం.. తన వద్ద డిపాజిట్లు చేసిన చందాదారులకు నగదు మొత్తం తిరిగి ఇచ్చిందా? ఎవరికైనా ఇవ్వకుండా ఎగవేసిందా? ఈ విషయాల సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ హైకోర్టు గతంలో జరిగిన విచారణలో రిజిస్ట్రీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చందాదారుల వివరాలకు సంబంధించిన ప్రకటనను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలోని అన్ని పత్రికలలో ప్రచురితమయ్యేలా చూడాలని స్పష్టం చేసింది..
ఉండవల్లి అరుణ్ కుమార్ కు సైతం..
ఇక ఇదే సమయంలో డిపాజిటర్ల డీటెయిల్స్ ఇవ్వాలని విన్నవిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వాటి ప్రకారం తాము మార్గదర్శికి తదుపరి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఇక విషయంపై రెండు వారాలలో కౌంటర్లు దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించినట్టు కనిపించడం లేదు. ముందుగానే చెప్పినట్టు మార్గదర్శికి అటు చంద్రబాబు, ఇటు రేవంతు అనుకూలమైన వ్యక్తులు కావడంతో.. ఆ దిశగా చర్యలు తీసుకుంటారనే నమ్మకం తమకు లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ ఐదేళ్లు మార్గదర్శి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని.. హైకోర్టు ఆదరించినప్పటికీ కాలయాపన చేస్తుంటాయని వారు విమర్శలు చేస్తున్నారు.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మార్గదర్శి ఎటువంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు చందాదారుల వివరాలతో కూడిన ప్రకటన చేస్తుందా.. లేకుంటే సమయం కావాలని అడుగుతుందా? అనేది చూడాల్సి ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.