Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య సూచన. జూన్ నెలకి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కిడిప్ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి నమోదు చేసుకోవచ్చు. మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవచ్చు. శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను మార్చి 21న 10 గంటలకు విడుదల చేస్తారు.
జూన్ లో జరిగే కార్యక్రమాలకు సైతం మార్చి 21న టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవల వర్చువల్ కోట టిక్కెట్లు విడుదల చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదిక్షణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదులు కోటాను విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.
మార్చి 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోట టికెట్లను విడుదల చేయనున్నారు. మార్చి 25న ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదులకోట ను విడుదల చేస్తారు. మార్చి 27 ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను.. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను.. మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రత్యేక ప్రకటనలో కోరింది.